అటు ఇటుగా 800 మంది సభ్యులన్న సంస్త ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా). ఈ సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తే అందులో ఐదారొందలమంది మంది మాత్రమే ఓటు వేస్తారని అంచనా. ఈ కోణంలో చూస్తే ఈ ఎన్నికలకు అసలు ప్రాధాన్యమే ఉండకూడదు. కానీ ‘మా’కు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రచ్చ మామూలుగా ఉండట్లేదు కొన్నేళ్లుగా కొన్నేళ్ల కిందట రాజేంద్ర ప్రసాద్, జయసుధ అధ్యక్ష పదవి కోసం తలపడ్డప్పటి నుంచి ‘మా’ ఎన్నికలు ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కించుకుంటున్నాయి. ఈసారి వేడి మరింతగా రాజుకుంది.
స్వతహాగా కన్నడిగుడైన ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల మీద అమితాసక్తిని ప్రదర్శిస్తూ అధ్యక్ష పదవికి రేసులో నిలవడం.. ఆయనకు పోటీగా మంచు విష్ణు లైన్లోకి రావడం.. ఇంకా జీవిత, సీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు కూడా అధ్యక్ష పదవిపై గురి పెట్టడంతో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎన్నికల బరిలో లేకపోయినా ఈ వ్యవహారం మరింత వేడెక్కడానికి పరోక్షంగా కారణమయ్యారు.
ప్రస్తుతం రేసులో ఉన్న వాళ్లకు తోడు ఇప్పుడు మరో వ్యక్తి ‘మా’ అధ్యక్ష పదవిపై గురి పెట్టారు. ఆయనెవరో కాదు.. సీనియర్ నటుడు కాదంబరి కిరణ్. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఉన్నప్పటికీ నటుడిగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన కాదంబరి కిరణ్‌కు ఇండస్ట్రీలో మాత్రం మంచి పరిచయాలే ఉన్నాయి. ఈ పరిచయాలతోనే తాను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘మా’ మాజీ అధ్యక్షుడైన శివాజీ రాజా తనకు బావ అవుతారని.. ఆయన మద్దతు తనకుందని.. ‘మా’లో సభ్యుల్లో చాలామంది తనకు సన్నిహితులని కాదంబరి కిరణ్ అన్నారు. ‘మా’లో సభ్యత్వం 800 మందికి పైగా ఉన్నప్పటికీ ఎన్నికల రోజు వచ్చి ఓట్లు వేసేది 500 మందేనని.. అందులో 350 ఓట్లు తనకు పడతాయని ధీమాగా చెప్పగలనని కిరణ్ అన్నారు. తాను ఇంత ధీమాగా ఎందుకు మాట్లాడుతున్నాననో ఎన్నికలు పూర్తయ్యాక అందరికీ తెలుస్తుందంటూ కిరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates