ఉర్రూత‌లూగించే లుక్‌లో స్టార్ హీరో

పితామ‌గ‌న్ (శివ‌పుత్రుడు), స్వామి, అన్నియ‌న్ (అపరిచితుడు) సినిమాల‌తో ఒక‌ప్పుడు విక్ర‌మ్ ఊపు మామూలుగా లేదు. అప్పుడు అత‌డున్న ఊపు చూస్తే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ల‌లో ఒకడిగా ఎదిగిపోయేలా క‌నిపించాడు. స్వామి, అన్నియ‌న్ సినిమాల‌తో అత‌ను త‌మిళ సినిమా వ‌సూళ్ల రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేశాడు కూడా. కానీ ఆ జోరును త‌ర్వాత కొన‌సాగించ‌డంలో విక్ర‌మ్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. స‌రైన సినిమాలు ఎంచుకోక‌పోవ‌డంతో ఎంత వేగంగా ఎదిగాడో.. అంత వేగంగా కిందికి ప‌డ్డాడు.

అప‌రిచితుడు త‌ర్వాత ఇప్ప‌టిదాకా విక్ర‌మ్ నుంచి నిఖార్స‌యిన హిట్టే లేదు. అయినా స‌రే.. అత‌డి అభిమానులు త‌న వెంటే ఉన్నారు. విక్ర‌మ్ స్థాయికి త‌గ్గ హిట్ వ‌స్తుంద‌నే ఆశ‌తో సుదీర్ఘ కాలం నుంచి నిరీక్షిస్తున్నారు. విక్ర‌మ్ న‌టిస్తున్న రెండు చిత్రాల మీద ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నారు.

విక్ర‌మ్ న‌టిస్తున్న కోబ్రా సినిమా పూర్తి కావ‌స్తుండ‌గా.. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌ను మొద‌లుపెట్టిన మ‌రో సినిమా మ‌ధ్య ద‌శ‌లో ఉంది. ఇందులో విక్ర‌మ్‌తో పాటు అత‌డి కొడుకు ధ్రువ్ విక్ర‌మ్ న‌టిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. కార్తీక్-విక్ర‌మ్ కాంబినేష‌న్ మీద ఉన్న అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా ఈ ఫ‌స్ట్ లుక్‌ను తీర్చిదిద్దారు.

విక్ర‌మ్ బైక్ మీద వ‌స్తుండ‌గా.. నెత్తిన కొమ్ములున్న‌ట్లు.. అలాగే అమ్మ‌వారికి ఉన్న‌ట్లుగా చుట్టూ చేతులు పెట్టి విభిన్నంగా ఈ ఫ‌స్ట్ లుక్‌ను తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి మ‌హాన్ అనే ఆస‌క్తిక‌ర‌ టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ లాంచ్‌తో పాటు ఒక మోష‌న్ పోస్ట‌ర్ సైతం వదిలారు. అది విక్ర‌మ్ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించేలా సాగింది. సంతోష్ నారాయ‌ణ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కోబ్రా విష‌యంలో ప్రేక్ష‌కుల‌కు ఇలాంటి ఎగ్జైట్మెంట్ పెద్ద‌గా క‌ల‌గ‌లేదు. మ‌హాన్ క‌చ్చితంగా విక్ర‌మ్‌ను ఫామ్‌లోకి తీసుకొస్తుంద‌న్న అంచ‌నాలు క‌లుగుతున్నాయి.