నానీపై అగ్ర నిర్మాత ఫైర్

నేచుర‌ల్ స్టార్ నాని ప‌రిస్థితి ఉన్న‌ట్లుండి చాలా ఇబ్బందిక‌రంగా త‌యారైంది టాలీవుడ్లో. ఆల్రెడీ అత‌డి వి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయ‌డం ప‌ట్ల గ‌త ఏడాది ఎగ్జిబిట‌ర్ల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని దాని నిర్మాత‌లు ఓటీటీ బాట ప‌ట్టించేశారు. ఈ డీల్ గురించి స‌మాచారం బ‌య‌టికి రావ‌డానికి ముందు తిమ్మ‌ర‌సు ఆడియో వేడుక‌లో నాని చేసిన ప్ర‌సంగం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సినిమాలంటే థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కావాల‌ని.. థియేట‌ర్ల‌లో సినిమాలు చూడ‌టం మ‌న సంస్కృతి అని పెద్ద పెద్ద మాట‌లే మాట్లాడాడు నాని. ఇలాంటి కామెంట్లు చేశాక ట‌క్ జ‌గ‌దీష్ థియేట‌ర్ల‌లో కాక ఓటీటీ రిలీజ్‌కు రెడీ కావ‌డం నాని అంద‌రికీ టార్గెట్ అయిపోయాడు. థియేట‌ర్ల గురించి అలా మాట్లాడి త‌న సినిమాను ఓటీటీ రిలీజ్‌కు ఎలా వ‌దిలేశాడ‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. చిన్న చిన్న సినిమాలు కూడా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంటే.. ట‌క్ జ‌గ‌దీష్ లాంటి క్రేజున్న మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌డ‌మేంట‌ని అంటున్నారు.

తాజాగా టాలీవుడ్ బిగ్ షాట్స్‌లో ఒక‌రైన ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ సునీల్ నారంగ్ నాని మీద విమ‌ర్శ‌లు గుప్పించారు. థియేట‌ర్ల గురించి అంత గొప్ప‌గా మాట్లాడిన నాని త‌న సినిమా ఓటీటీలో రిలీజ‌వుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వినాయ‌క చ‌వితి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతున్న ల‌వ్ స్టోరికి పోటీగా అదే రోజు ఓటీటీలో ట‌క్ జ‌గ‌దీష్‌ను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డం ప‌ట్లా ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఓటీటీల్లో మంచి డీల్స్ రాబ‌ట్టుకోవ‌డం కోసం థియేట‌ర్ల‌ను పావుగా వాడుకుంటున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు.

మ‌రోవైపు ఓటీటీల్లో కొత్త సినిమాల రిలీజ్‌కు రెడీ అవుతున్న నిర్మాత‌ల‌కు మ‌రోసారి హెచ్చ‌రిక జారీ చేస్తూ సునీల్ నారంగ్ కీల‌కంగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ త‌ర‌ఫున తాజాగా కొత్త ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.ఇదిలా ఉండ‌గా ఆల్రెడీ ట‌క్ జ‌గ‌దీష్ రిలీజ్ విష‌యంలో నిర్మాత‌ల శ్రేయ‌స్సే ముఖ్య‌మ‌ని, నిర్ణ‌యం వారికే వ‌దిలేశాన‌ని నాని స్టేట్మెంట్ ఇవ్వ‌డం తెలిసిందే. ఒక సినిమాను ఎలా రిలీజ్ చేయాల‌న్న నిర్ణ‌యం నిర్మాత‌దే అయిన‌ప్ప‌టికీ.. హీరో నానీని ఇలా టార్గెట్ చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.