18 కోట్లలో సినిమా చేసి 32 కోట్లని చెప్పారట

తమిళ కథానాయకుడు కార్తి ప్రధాన పాత్రలో కోలీవుడ్ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ అప్పట్లో ఒక సంచలనం. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం మన ప్రేక్షకులనూ బాగానే ఆకట్టుకుంది. సెల్వ కెరీర్ ఆరంభం నుంచి ఇంటెన్స్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. కానీ ఈ చిత్రంలో చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని సంచలన కథాంశంతో సినిమా తీసి ఔరా అనిపించాడు. చివర్లో కొంచెం దారి తప్పినప్పటికీ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించే సినిమా ఇది.

ఈ చిత్రానికి కొనసాగింపుగా ధనుష్ హీరోగా ఆయిరత్తిల్ ఒరువన్-2 చిత్రాన్ని కూడా సెల్వ అనౌన్స్ చేయడం తెలిసిందే. 2024లో ఈ సినిమా విడుదలవుతుందని ప్రకటన కూడా వచ్చింది. ఐతే ఆ సినిమా మొదలుపెట్టే ముందు ‘యుగానికి ఒక్కడు’ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సెల్వ రాఘవన్. ఈ సినిమా బడ్జెట్ అందరూ అనుకున్నంత అవలేదని అతను ట్విట్టర్లో ప్రకటించాడు.

2010లో విడుదలైన ‘యుగానికి ఒక్కడు’ సినిమాను రూ.18 కోట్లలోనే పూర్తి చేశామని.. కానీ మీడియాలో హైప్ కోసమని.. దీన్నో మెగా బడ్జెట్ మూవీగా చెప్పుకోవడం కోసం అప్పట్లో దాని బడ్జెట్ రూ.32 కోట్లని చెప్పుకున్నట్లు సెల్వ రాఘవన్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది తెలివి తక్కువ పని అన్న సెల్వ.. ఒరిజినల్ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టినప్పటికీ.. తాము బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆ వసూళ్లతో అది యావరేజ్ అని మాత్రమే అనిపించుకుందని సెల్వ చెప్పాడు.

ఐతే ఆ అనుభవం తనకు పాఠం నేర్పిందని.. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పుకోవడం జరగదని సెల్వ రాఘవన్ స్పష్టం చేశాడు. సినిమా విడుదలైన 11 ఏళ్ల తర్వాత సెల్వ ఇలా ఓపెన్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. మరి అంత భారీ చిత్రాన్ని అప్పట్లో రూ.18 కోట్లలోనే పూర్తి చేసిన సెల్వ.. తన తమ్ముడితో చేయబోతున్న ఆయిరత్తిల్ ఒరువన్-2ను ఎంత బడ్జెట్లో అవగొడతాడో చూడాలి.