రానా అభిమానుల్ని కూల్ చేద్దామ‌ని..

స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా విడుద‌లైన భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ గ్లింప్స్ ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంత‌గా ఉర్రూతూల‌గించిందో తెలిసిందే. సామాన్య ప్రేక్ష‌కుల‌కు కూడా ఆ టీజ‌ర్ భ‌లేగా న‌చ్చేసింది. ప‌వ‌న్‌ను అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలాంటి మాస్ అవ‌తారంలో చూపిస్తూ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఆ టీజ‌ర్‌ను తీర్చిదిద్దింది చిత్ర బృందం.

ఐతే కొంద‌రు మాత్రం ఈ టీజ‌ర్ ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మ‌ల‌యాళంలో మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సోలో హీరో సినిమాగా మార్చేశార‌ని.. రానాను బాగా డౌన్ ప్లే చేసేశార‌ని.. టీజ‌ర్లో అత‌డికి చోటే ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని.. ఇలా ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంద‌రు ప‌వ‌న్ యాంటీ ఫ్యాన్స్ దీని మీద ట్విట్ట‌ర్లో రెచ్చిపోయి కామెంట్లు చేశారు కూడా.

ఐతే వాళ్ల‌కు స‌మాధానంగా కాక‌పోవ‌చ్చు కానీ.. రానా అభిమానులు ఫీల‌వ్వ‌కుండా ఓ అప్‌డేట్ ఇవ్వ‌బోతోంద‌ట చిత్ర బృందం. రానా మీద స్పెష‌ల్‌గా ఒక టీజ‌ర్ వ‌ద‌ల‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ పుట్టిన రోజుకు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం నిర్ణ‌యించ‌గా.. దానికి ముందో త‌ర్వాతో రానా పాత్ర నేప‌థ్యంగా టీజ‌ర్‌గా రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఆ పాత్ర‌కు మంచి ఎలివేష‌న్ ఇచ్చేలా.. సినిమాలో దాని ప్రాధాన్య‌మేంటో తెలిపేలా ప‌వ‌ర్‌ఫుల్‌గానే ఆ టీజ‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం.

కాబ‌ట్టి రానా ఫ్యాన్స్ మ‌రీ హ‌ర్ట‌యిపోవాల్సిన ప‌ని లేద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఈ సినిమా మాతృక అయ్య‌ప్ప‌నుం కోషీయుంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర‌లో రానా క‌నిపించ‌నున్నాడు. అత‌డి పాత్ర పేరు డానియ‌ల్ శేఖ‌ర్ అని మొన్న‌టి ఫ‌స్ట్ గ్లింప్స్‌లోనే రివీల్ అయింది.