థ్రిల్లర్ స్పెషలిస్ట్.. ఇంకో సినిమా

టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలకు పేరుపడ్డ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య, అర్జున్ సురవరం.. ఇలా ఇప్పటిదాకా చాలా థ్రిల్లర్సే చేశాడు నిఖిల్. అతడికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే జానర్ ఇది. ప్రేక్షకులు ఎక్కువగా అతణ్నుంచి ఈ తరహా చిత్రాలే ఆశిస్తారు.

ప్రస్తుతం నిఖిల్ ‘కార్తికేయ-2’తో మరోసారి థ్రిల్లర్ జానర్‌ను టచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిఖిల్ ఖాతాలోకి మరో థ్రిల్లర్ మూవీ వచ్చి చేరింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

రెడ్ సినిమాస్ అనే సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. కానీ అతను ఇండస్ట్రీకి కొత్త మాత్రం కాదు. గూఢచారి, ఎవరు, హిట్ లాంటి చిత్రాలతో ఎడిటర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న గ్యారీ బీహెచ్.. నిఖిల్ హీరోగా ఈ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించనున్నాడు. త్వరలోనే సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఇండియన్ ఫ్లాగ్‌తో పాటు ఈఫిల్ టవర్.. మరెన్నో ప్రదేశాలను చూపించారు. దీన్ని బట్టి ఈ కథ దేశ విదేశాల్లో నడుస్తుందని.. సినిమా భారీ బడ్జెట్లోనే తెరకెక్కబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డి నిర్మాత.

నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ‘కార్తికేయ-2’ షూటింగ్ చివరి దశలో ఉంది. ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు సుకుమార్ స్క్రిప్టుతో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో నిఖిల్ నటించిన ‘18 పేజెస్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే నిఖిల్ డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు. ఇదొక లవ్ స్టోరీ. ఇందులో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.