ఓటీటీ డీల్స్‌లో ట్విస్ట్‌లు

కరోనా కష్ట కాలంలో నిర్మాతలకు గొప్ప ఊరట ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లు. థియేటర్లు మూతపడ్డ సమయంలో దిక్కు తోచని స్థితిలో ఉన్న నిర్మాతలకు ఓటీటీ డీల్స్ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి. కొన్ని చిత్రాలకు థియేటర్లలో వచ్చే ఆదాయానికి మించిన రేటు ఇచ్చి సినిమాలను కొనడం విశేషం.

సినిమాకు ఆధారం అయిన థియేటర్ల సంగతి పట్టించుకోకుండా నిర్మాతలు ఓటీటీల బాట పట్టడం పట్ల ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అలా చేశామని నిర్మాతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఐతే ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాక కూడా కొన్ని సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తుండటం పట్ల ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ఇప్పటికే పూర్తయిన ఓటీటీ డీల్స్‌ను క్యాన్సిల్ చేసుకోవడం.. లేదా ఒప్పందాలను మార్చడం లాంటివి చేస్తున్నారు. ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయాలనుకున్న చిత్రాలను.. ముందు థియేటర్లలో రిలీజ్ చేసి వారం రెండు వారాల గ్యాప్‌లో ఓటీటీల్లో వదిలేలా డీల్స్ మారుస్తున్నారు.

ఈ క్రమంలోనే కమెడియన్ సత్య ప్రధాన పాత్ర పోషించిన ‘వివాహ భోజనంబు’ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తెస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సోనీ లివ్ వాళ్లకు అమ్మేయడం తెలిసిందే. ఆ ఓటీటీలో రిలీజ్ కానున్న తొలి తెలుగు చిత్రంగా దీన్ని చెప్పుకున్నారు. ఐతే ఇది థియేటర్లలో బాగా ఎంజాయ్ చేసే సినిమా కావడంతో డీల్ మారినట్లు తెలుస్తోంది. అలాగే సుశాంత్ సినిమా ‘ఇచట వాహనములు నిలుపరాదు’ విషయంలోనూ డీల్‌ను రివైజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వాళ్లు హోల్‌సేల్‌గా కొనేసి ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు ఓ దశలో. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయింది. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఆ తర్వాత ఓటీటీలోకి వెళ్తుంది. ఈ క్రమంలో మరి కొన్ని చిత్రాలు ఓటీటీ డీల్ రివైజ్ చేసుకుని థియేట్రికల్ రిలీజ్ వైపు అడుగులేసే అవకాశాలున్నాయి. దృశ్యం-2, విరాటపర్వం, మ్యాస్ట్రో లాంటి చిత్రాల విషయంలోనూ ఇలా కథ మలుపు తిరిగితే ఆశ్చర్యం లేదు.