బాల‌య్య.. 80 రోజులు డిష్యుం డిష్యుం


నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి రెండు చిత్రాలు సింహా, లెజెండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌వ‌డంతో ఈసారి వీరి నుంచి వ‌స్తున్న అఖండ‌పై అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి. అందుకు త‌గ్గ‌ట్లే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు టీజ‌ర్ల‌కూ అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

బాల‌య్య‌-బోయ‌పాటి అంటే ప్ర‌ధానంగా యాక్ష‌న్ ఘ‌ట్టాలు, హీరో ఎలివేష‌న్ సీన్ల‌పై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. అఖండ‌లో వాటి డోస్ గ‌త రెండు చిత్రాల కంటే ఎక్కువే ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ సినిమా మేకింగ్‌లో భాగంగా దాదాపు స‌గం వ‌ర్కింగ్ డేస్ కేవ‌లం యాక్ష‌న్ ఘ‌ట్టాల‌కే అయ్యాయ‌ట‌. ఏకంగా 80 రోజులకు పైగా ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ట‌.

ఈ విష‌యాన్ని అఖండ యాక్ష‌న్ టీంలో భాగ‌మైన స్ట‌న్ శివనే స్వ‌యంగా వెల్ల‌డించాడు. అఖండ సినిమా షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని కూడా అత‌నే చెప్పాడు. దీనిపై ట్వీట్ వేశాడు. అఖండ షూటింగ్ పూర్త‌యింది. మొత్తం యూనిట్ ఒక కుటుంబం లాగే సాగింది. ఇంట‌ర్వెల్, ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్, మిగ‌తా యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు 80 రోజుల‌కు పైగానే ప‌ట్టింది అని అత‌ను ట్విట్ట‌ర్లో పేర్కొన్నాడు.

సెట్లో వ‌ర్షంలో త‌డుస్తూ ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో ఉన్న ఫొటోను కూడా అత‌ను షేర్ చేశాడు. ఈ చిత్రానికి ముందు రామ్-లక్ష్మ‌ణ్ ఫైట్ మాస్ట‌ర్లుగా ఎంపిక‌య్యారు. కొన్ని రోజులు ప‌నిచేశాక డేట్ల స‌మ‌స్య రావ‌డంతో వారు త‌ప్పుకున్నారు. వారి స్థానంలోకి స్ట‌న్ శివ వ‌చ్చాడు.