తెలుగులోకి కొత్త ఓటీటీ.. తొలి సినిమా ఇదే

సోనీ లివ్.. సౌత్‌లో బాగా పాపుల‌ర్ అయిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్. హిందీలో పెద్ద ఛానెల్ నెట్ వ‌ర్క్ ఉన్న సోనీ సంస్థ.. త‌మ ద‌గ్గ‌రున్న సినిమాల‌తో ఓటీటీని మొద‌లుపెట్టి బాగానే పాపుల‌ర్ చేసింది. హిందీలో భారీ చిత్రాల‌ను కొన‌డ‌మే కాక‌, సొంతంగా స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకుంది.

ఇప్పుడీ సంస్థ సౌత్ మీద దృష్టిపెట్టింది. ఇప్ప‌టికే త‌మిళంలో కొన్ని క్రేజీ సినిమాల‌ను ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలుగు సినిమాల మీదా ఫోక‌స్ పెడుతోంది. చిన్న స్థాయిలో తెర‌కెక్కిన ఓ కామెడీ మూవీ స్ట్రీమింగ్‌తో తెలుగులోకి అడుగు పెట్ట‌బోతోంది. ఆ చిత్ర‌మే.. వివాహ భోజ‌నంబు. క‌మెడియ‌న్ స‌త్య లీడ్ రోల్ చేసిన తొలి చిత్ర‌మిది. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ దీన్ని నిర్మించాడు.

లాక్ డౌన్ టైంలో ఇంట్లోకి బంధుగణం పెద్ద ఎత్తున వ‌చ్చి ప‌డితే కొత్త‌గా పెళ్ల‌యిన ఓ కుర్రాడు ప‌డే అవ‌స్థ‌ల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది. రామ్ అబ్బ‌రాజు అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో బోలెడంత‌మంది క‌మెడియ‌న్లు నటించారు. ఓ కొత్తమ్మాయి క‌థానాయిక‌గా చేసింది. ఆ మ‌ధ్య రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది.

సోనీ లివ్‌లో రిలీజ్ కాబోయే తొలి చిత్రం త‌మ‌దే అంటూ అనౌన్స్ చేయ‌డంతో పాటు బుధ‌వార‌మే వివాహ భోజ‌నంబు ట్రైల‌ర్ కూడా లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సందీప్ కిష‌న్ వెల్లడించాడు. ఈ సినిమాలో ఆనంది ఆర్ట్స్ లాంటి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కూడా భాగ‌స్వామి అయింది. ఫన్నీ ట్రైల‌ర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ఇవ్వ‌బోతోంద‌ట వివాహ భోజ‌నంబు టీం. మ‌రి ఈ ట్రైల‌ర్ ఏమేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.