మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మాతృభాష మరాఠీలో ముందుగా సినిమాలు చేసి.. ఆ తర్వాత హిందీలో పెద్ద సినిమాల్లోనే నటించింది. కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్ లాంటి పెద్ద హీరోతో ‘సూపర్ 30’ లాంటి మంచి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది మృణాల్. ఇటీవలే అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన ‘తూఫాన్’లో ఆమే హీరోయిన్. తెలుగు నుంచి హిందీలోకి రీమేక్ అవుతున్న ‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన మంచి పాత్రలో ఆమె కనిపించబోతోంది.
చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల లాగే మృణాల్ సైతం సౌత్‌లోకి అడుగు పెడుతోంది. ఇక్కడ చేయబోతున్న తొలి సినిమా తెలుగుదే. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా ఉమ్మడిగా నిర్మిస్తున్న కొత్త చిత్రంలో మృణాలే కథానాయిక.
ఈ విషయాన్ని మృణాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారమే రివీల్ చేశారు. ఇందులో మృణాల్.. సీత అనే పాత్రలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించబోతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల మాదిరి హడావుడి లేకుండా సైలెంటుగా టాలీవుడ్లోకి అడుగు పెట్టేస్తోంది మృణాల్. కాగా ఈ చిత్రానికి కుదిరిన కాంబినేషన్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తీస్తున్నదేమో తెలుగు సినిమా. కానీ దానికి దర్శకుడు, నిర్మాతలు తప్ప అంతా ఇతర భాషల వాళ్లే. హీరో మలయాళీ కాగా.. హీరోయిన్ బాలీవుడ్ భామ.
దీని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ తమిళులు. ఇలాంటి కాంబినేషన్ కుదరడం అరుదు. సౌత్ అంతటా దుల్కర్‌కు మంచి పేరే ఉంది. హీరోయిన్ బాలీవుడ్ అమ్మాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారేమో మేకర్స్. ఇది ఒక యుద్ధ సైనికుడి కథతో తెరకెక్కతున్న చిత్రం.