పరువునష్టం కేసులోనూ శిల్పకు ఎదురుదెబ్బ తప్పలేదుగా!


బాలీవుడ్ ను మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బూతు సినిమాల వ్యవహారం. ఓటీటీ పేరుతో అశ్లీల సినిమాలు తీయటం.. సదరు బూతు సినిమాల కోసం నటీమణులపై ఒత్తిడి తెచ్చిన వైనంతో పాటు.. ఈ సినిమాల కోసం అతడు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా శిల్పాశెట్టి – ఆయన భర్తకు సంబంధించిన వార్తలు మీడియాలోనూ..సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కథనాలు భారీగానే వెలువడ్డాయి.

ఇలాంటివేళ.. తన పరువుకు భంగం వాటిల్లుతోందంటూ ప్రముఖ నటి శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బూతు చిత్రాలకు సంబంధించిన ఉదంతంలో రాజ్ కుంద్రా.. శిల్పాశెట్టిపై మీడియా.. సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బూతు సినిమాల ఎపిసోడ్ లో రాజ్ కుంద్రాను ఇప్పటికే అరెస్టు చేయటం.. వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే మీడియాలో వచ్చేశాయి.

శిల్పాశెట్టి తరఫున వాదనలు వినిపించటానికి కోర్టుకు హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ మాట్లాడుతూ.. భార్యభార్తల మధ్య సంభాషణ గురించి మీడియాలో రావటం సరికాదన్నారు. కుంద్రాను వారింటికి పోలీసులు తీసుకెళ్లినప్పుడు శిల్పా భావోద్వేగానికి గురి కావటం.. వారిద్దరి మధ్య వాదులాట చోటు చేసుకోవటం లాంటివి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రావటం తెలిసిందే. ఈ వార్తల్ని ఉద్దేశించి న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ.. పోలీసులు చెప్పిన వివరాల్ని ప్రసారం చేస్తే పరువుకు నష్టం వాటిల్లినట్లు కాదని.. ఇలా ప్రతి విషయాన్ని అడ్డుకోవాలంటే అతి పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

శిల్పాశెట్టి తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం పోలీసుల ముందే జరిగాయని.. పోలీసులు ఇచ్చిన వివరాలతోనే మీడియాలో రిపోర్టులు వచ్చినట్లుగా పేర్కొనటంపై న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ స్పందిస్తూ.. ‘మీరు పబ్లిక్ లైఫ్ ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో మీరు ఏడ్చారు.. మీ భర్తతో వాదులాడారు అన్న విషయాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే గుర్తు చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా తాము నిర్ణయాలు తీసుకోమన్న న్యాయస్థానం.. పిల్లల పెంపకంపై శిల్పా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారన్న అంశాల్ని ప్రచురించే వేళలో మాత్రం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చేలా మీడియా సంయమనం పాటించాలన్న హితవు మాత్రం పలికారు. ఇప్పటికైనా శిల్పకు ఏది పరువు నష్టం అన్న విషయంపై క్లారిటీ వచ్చేసి ఉంటుంది.