చిత్ర‌మైన కాంబినేష‌న్లో వెరైటీ సినిమా

మ‌ల్లేశం అనే మంచి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు రాజ్ రాచ‌కొండ‌. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న చేనేత కార్మికుడు మ‌ల్లేశం క‌థ‌కు ఎంతో హృద్యంగా వెండితెర రూపం ఇచ్చాడ‌త‌ను. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత మంచి ఫ‌లితాన్ని అందుకోలేదు కానీ.. ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జ‌నాలు బాగానే చూశారు. ఇప్పుడీ చిత్ర ద‌ర్శ‌కుడు ఓ విభిన్న ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఐతే రాజ్ నుంచి ఈసారి వ‌స్తున్న‌ది తెలుగు సినిమా కాదు, దానికి అత‌ను ద‌ర్శ‌కుడూ కాదు. మ‌ల‌యాళంలో నిర్మాత‌గా ప‌క అనే సినిమా చేస్తున్నాడు రాజ్. మ‌ల్లేశం చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా ప‌ని చేసిన మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన నితిన్ లూకాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇదొక వ‌యొలెంట్ మూవీ. ఒక‌రి మీద ఒక‌రు ద్వేషంతో ర‌గిలిపోయే రెండు కుటుంబాల మ‌ధ్య ఈ క‌థ న‌డుస్తుంద‌ట‌. అంద‌రూ కొత్త వాళ్లే ముఖ్య పాత్ర‌లు పోషించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకుంది. సెప్టెంబ‌రులో జరిగే టొరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శ‌న‌కు కూడా ఎంపికైంది.

ఈ సినిమా గురించి తెలుసుకుని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామి అయ్యాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం కోసం అనురాగ్ ఈ టీంతో క‌లిశాడు. అత‌డికి అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇలా ఒక తెలుగు ద‌ర్శ‌కుడు.. మ‌ల‌యాళంలో సినిమా తీయ‌డం.. దానికి ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం విశేష‌మే. ఈ చిత్రాన్ని తెలుగు స‌హా ప‌లు భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయ‌బోతున్నారు.