శిల్పా శెట్టి.. ఇది బ్యాడ్ టైమ్ అంతే

కథానాయికగా బాలీవుడ్లో శిల్పా శెట్టిది అంత పెద్ద రేంజ్ ఏమీ కాదు. కెరీర్లో ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలే చేసింది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఆమెను ఎప్పుడూ పరిగణించేవారు కాదు. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాలు చేసిన ఆమెకు ఇక్కడా అంతగా కలిసి రాలేదు.

ఐతే కథానాయికగా చరమాంకంలో ఉన్న సమయంలో బ్రిటిష్ రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’లో నటించడం ద్వారా ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చుకుందామె. ఆ షోలో ఆమెపై వర్ణ వివక్ష చూపించడంతో సానుభూతి వర్కవుట్ కావడం.. ఆమె అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ కావడం జరిగింది.

ఆ తర్వాత ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌లో వాటా పొందడం, రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోవడం.. యోగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం.. భర్తతో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం.. ఇలా శిల్పా రేంజే మారిపోయింది. కెరీర్ ముగిసిందనుకున్న స్థితి నుంచి ఆమె ఎదుగుదల చూసి తన తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారనడంలో సందేహం లేదు.

ఐతే కొన్ని నెలల ముందు వరకు శిల్పాకు అన్నీ సానుకూలంగానే కనిపించాయి. కానీ గత కొన్ని నెలల్లో ఉన్నట్లుండి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత సంకట స్థితిని ఎదుర్కొంటోందామె. శిల్పా భర్త రాజ్ కుంద్రా.. పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు.

అతడిపై అభియోగాలు బలంగానే ఉన్నట్లున్నాయి. అవి రుజువైతే ఏడేళ్ల దాకా జైలు శిక్ష పడొచ్చంటున్నారు. శిక్ష సంగతలా ఉంచితే ఈ కేసు నుంచి అంత తేలిగ్గా బయటపడేట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. కుంద్రా కేసు పుణ్యమా అని ఆమె జడ్జిగా వ్యవహరించే ఒక డ్యాన్స్ షో నుంచి తనను తప్పించేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఆమె చేతిలో ఉన్న కమర్షియల్ బ్రాండ్స్ కొన్ని చేజారేలా కనిపిస్తున్నాయి. కొత్త బ్రాండ్లు ఏవీ ఆమెను సంప్రదించకపోవచ్చు. మరోవైపు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శిల్పా ‘హంగామా-2’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం హిట్టయితే మళ్లీ బాలీవుడ్లో బిజీ అయిపోదామనుకుంటే.. అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శిల్పా పెర్ఫామెన్స్ పట్ల బ్యాడ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పొడుగు కాళ్ల సుందరికి టైం అస్సలు బాగున్నట్లు లేదిప్పుడు.