రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నటి!

Yahika-Annand

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో బిగ్ బాస్ ఫేమ్, నటి యాషిక ఆనంద్ సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యాషిక స్నేహితురాల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందారు. జూలై 25న రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

వేగంగా దూసుకుపోయిన కారు డివైడర్ ని ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. అదే రోడ్డులో ప్రయాణిస్తున్న కొందరు ఈ ప్రమాదం చూసి షాకయ్యారు. వెంటనే తేరుకొని కారులో నుండి యాషికాను ఆమె స్నేహితులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వల్లిశెట్టి భవాని కారులోనే ఇరుక్కుపోయి మరణించారు.

భవాని మృతదేహాన్ని అటాప్సీ కోసం చెంగల్ పట్టు హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యాషిక ఆనంద్ తమిళనాడులో మోడల్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘కావలై వెండమ్’, ‘నోటా’, ‘ధ్రువంగల్ పతినారు’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు తమిళ సినిమాలున్నాయి.