ఆమిర్ సినిమాలో చైతూ పాత్ర అదేనా?

బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసిన టాలీవుడ్ నటుల్లో అక్కినేని నాగార్జున పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. తెలుగు స్టార్లలో నాగ్ చేసినన్ని హిందీ సినిమాలు, ముఖ్య పాత్రలు ఇంకెవరూ చేయలేదు. ఇటీవలే ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు నాగ్. ఇప్పుడు నాగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య కూడా బాలీవుడ్లోకి అడుగు పెట్టేస్తున్నాడు.

అతను ఆమిర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి చైతూ చేస్తున్న పాత్రను ముందు విజయ్ సేతుపతితో చేయించాలనుకున్నారు. కానీ డేట్ల సమస్యో మరో కారణమో కానీ.. అతనీ చిత్రంలో నటించలేకపోయాడు. ఆ పాత్ర చైతూను వరించింది. ఆమిర్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఎంత అంచనాలుంటాయో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి బాలీవుడ్లోకి చైతూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లే.

ఇంతకీ ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ ఏం పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం. ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తే అతను సైనికుడిగా కనిపించనున్నాడని తేలిపోయింది. ఐతే ఈ పాత్రకు సంబంధించిన మరిన్ని విశేషాలు బయటపడ్డాయి. ‘లాల్ సింగ్ చద్దా’ హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

టామ్ హాంక్స్ అద్భుత అభినయం ప్రదర్శించిన ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఒరిజినల్లో ‘బబ్బా’ అనే ఆసక్తికరమైన పాత్ర ఉంటుంది. సైన్యంలోకి అడుగు పెట్టిన హీరోకు అక్కడ దొరికే ఏకైక స్నేహితుడు బబ్బానే. కాస్త చిత్రమైన హావభావాలతో అమాయకంగా కనిపిస్తాడు. అతడి కంపెనీని హీరో ఎంతో ఇష్టపడతాడు. ఆర్మీ నుంచి రిటైరయ్యాక పెద్ద ఓడ కొనుక్కుని దాని ద్వారా సముద్రంలో చేపలు పట్టాలన్నది అతడి కల. కానీ అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి.

హీరో సైన్యం నుంచి నిష్క్రమించాక బబ్బా కలను నెరవేరుస్తాడు. సినిమాలో ఈ పాత్ర ఉండేది అటు ఇటుగా అరగంటే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కొనసాగుతుంది. చైతూ ఈ పాత్రలోనే నటిస్తున్నాడని సమాచారం.