78 ఏళ్ల వయసులో ఎవరైనా ఒంటిని, బుర్రని కష్టపెట్టుకోవాలని అనుకోరు. వయసులో ఉండగా కష్టపడ్డా.. పడకున్నా.. వృద్ధాప్యంలోకి వచ్చాక విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ చాలా కొద్ది మంది మాత్రం ఇందుకు మినహాయింపు. తమ పనిలో ఆనందం వెతుక్కుంటూ.. తమ పని ద్వారా ఇతరులకు ఆనందం పంచుతూ సాగడానికే చూస్తారు వాళ్లు.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ కోవకే చెందుతారు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఆయన తన అద్భుత సంగీతంతో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు. 70, 80, 90 దశకాల్లో ఇళయరాజా సౌత్ ఇండియన్ సినిమాను ఎలా ఏలారో.. తన సంగీతంతో కోట్లాది మందిని ఎలా ఓలలాడించారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఐతే 90ల చివరి నుంచి ఇళయరాజాకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ ఓ సినిమా మాత్రమే చేస్తున్నారు. ఐతే వయసు మీదపడిందని, అవకాశాలు తగ్గాయని ఆయనేమీ రిటైర్మెంట్ తీసుకోలేదు.
తన దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారు. తన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తెలుగులో ‘సన్ ఆఫ్ ఇండియా’.. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు ఇళయరాజా. ఈ వయసులో కూడా ఇళయరాజా ఒక కొత్త స్టూడియోను మొదలుపెట్టడం విశేషం.
ఇంతకుముందు ఆయన రమేష్ ప్రసాద్ తనకు బహుమానంగా ఇచ్చిన స్టూడియోలో రికార్డింగ్ చేసుకునేవారు. దాని చుట్టూ వివాదం నెలకొనడంతో బయటికి వచ్చేశారు. చెన్నైలో తన కోసం కొత్తగా స్టూడియో కట్టుకున్నారు. దాన్ని తన పిల్లలతో కలిసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా సంగీతం గురించి ఉద్వేగంగా మాట్లాడారు.
కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ టైంలో జనాలు సంగీతంతోనే ఉపశమనం పొందారని.. సంగీతానికి మరణం లేదని.. తనకు ఓపిక ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటానని.. సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉంటానని ఆయన పేర్కొనడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates