కోలీవుడ్ లో దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన సముద్రఖని ఆ తరువాత నటుడిగా మారి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. సముద్రఖని ప్రధాన పాత్రలో కూడా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. నటుడిగా ప్రేక్షకులు సముద్రఖనిని ఆదరించారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి ఆయనపై పడింది. ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ లాంటి సినిమాల్లో సముద్రఖని విలన్ గా కనిపించారు.
‘క్రాక్’ సినిమాలో అయితే ఆయన పాత్రకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటిలో కూడా సముద్రఖని కనిపించబోతున్నారు. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ ఆయనే. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో కీలకపాత్రలో చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో సముద్రఖని కనిపించనున్నారు. తాజాగా ఆయన మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖనికి మంచి పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ కథలో చాలా మార్పులు చేస్తున్నారు. కాబట్టి సముద్రఖనికి ఎలాంటి రోల్ ఆఫర్ చేశారనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తోన్న చిరు త్వరలోనే ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో సముద్రఖని కూడా పాల్గొంటారట. మొత్తానికి మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పట్లో సముద్రఖనిని విడిచిపెట్టేలా లేరు!
Gulte Telugu Telugu Political and Movie News Updates