శ్రీకాంత్ అడ్డాల.. అన్నాయ్

టాలీవుడ్ దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒక రకమైన దర్శకుడు. పూర్తిగా తాను పుట్టి పెరిగిన ప్రాంతం నేపథ్యంలో సినిమాలు తీసే అతను.. ఎక్కువగా హైదరాబాద్‌లో కూడా ఉండడు. సినిమా చేసినన్ని రోజులు ఇక్కడుండి మళ్లీ తమ ప్రాంతానికి వెళ్లి మామూలు జీవితం గడుపుతుంటాడు.

మళ్లీ తన అనుభవాలను మూటగట్టుకుని వచ్చి ఇక్కడ సినిమా తీస్తుంటాడు. ఐతే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో యువ, కుటుంబ ప్రేక్షకుల మనసు దోచిన శ్రీకాంత్‌కు ఆ తర్వాతి రెండు సినిమాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. ‘ముకుంద’ ప్రేక్షకులను మెప్పించకపోగా.. ‘బ్రహ్మాత్సవం’ అవమాన భారాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు అడ్డాల. చివరికి రీమేక్ మూవీ అయిన ‘నారప్ప’తో అతను రీఎంట్రీ ఇస్తున్నాడు.

శ్రీకాంత్ ఏంటి రీమేక్ ఏంటి.. పైగా సున్నితమైన సినిమాలు చేసే అతను ఇంత వయొలెంట్ మూవీని డైరెక్ట్ చేయడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ పునరాగమనానికి ఏదో ఒక దారి కోసం చూస్తున్న అతను.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లున్నాడు. ఐతే ‘నారప్ప’ తర్వాత ఏంటి అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. దీనికి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. ‘అన్నాయ్’ పేరుతో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్లు తెలిపాడు.

గుంటూరు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ చిత్రం అని అతను వెల్లడించడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయనున్నాడట శ్రీకాంత్. ఐతే దీనికి హీరో ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదట. శ్రీకాంత్ రీఎంట్రీ మూవీ గీతా బేనర్లోనే అని రెండేళ్ల కిందటే ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కకముందే ‘నారప్ప’లో ఛాన్స్ వచ్చింది. మరి శ్రీకాంత్‌ను నమ్మి ట్రయాలజీ యాక్షన్ ఫిలింలో చేసే హీరో ఎవరో చూడాలి.