ఈ హీరోను గుర్తు పట్టారా?


పై చిత్రంలో శ్రీకాంత్ పక్కన ఉన్న నటుడెవరో గుర్తు పట్టగలరా.. పోనీ పైన కనిపిస్తున్న పోస్టర్లో పోలీస్ డ్రెస్సులో ఉన్న నటుడినైనా గుర్తించగలరా..? ఎవరో కొత్త నటుడు అనే అనిపిస్తోంది కదా..? కానీ ఈ నటుడు ఒకప్పుడు టాలీవుడ్లో హీరోగా బిజీగా ఉన్నాడు. చిన్న స్థాయి సినిమాలు డబుల్ డిజిట్లోనే చేశాడు. హీరోగానే కాక సహాయ పాత్రల్లోనూ నటించాడు. కానీ ఉన్నట్లుండి కనుమరుగైపోయి ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటారా.. రోహిత్. పేరు చెప్పినా గుర్తుకు రాలేదంటే.. అతను నటించిన యూత్ ఫుల్ హిట్ మూవీ ‘6 టీన్స్’ను గుర్తు చేయాల్సిందే. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర రెడ్డి కెరీర్ ఆరంభంలో తీసిన ‘6 టీన్స్’ అప్పట్లో యువతను ఆకట్టుకుని మంచి హిట్టే అయింది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో రోహిత్.. జానకి వెడ్స్ శ్రీరామ్, గుడ్ బాయ్, ముత్యం, సొంతం, నవ వసంతం లాంటి చిత్రాల్లో నటించాడు.

కానీ వరుస పరాజయాలు పలకరించడంతో హఠాత్తుగా తన కెరీర్ ఆగిపోయింది. మధ్యలో దశాబ్దం పైగా కనిపించకుండా పోయిన రోహిత్.. ఇప్పుడు హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను ప్రధాన పాత్రలో ‘కళాకార్’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రోహిత్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఒకప్పుడు బక్క చిక్కి ఉన్న రోహిత్.. ఇప్పుడు కొంచెం ఒళ్లు చేసి, బుగ్గలు పెంచి గుర్తు పట్టలేనట్లుగా మారిపోయాడు. హేర్ స్టైల్ కూడా మారిపోయింది.

మిడిల్ ఏజ్ వచ్చేస్తుండటంతో జుట్టు, గడ్డం తెల్లబడి ఎవరో కొత్త వ్యక్తిలా కనిపించాడు. ‘కళాకార్’ విషయానికి వస్తే శ్రీను బండెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఫస్ట్ లుక్ అవీ చూస్తే ఏమంత ఆకర్షణీయంగా అయితే లేవు. జనాలు పూర్తిగా మరిచిపోయిన చిన్న స్థాయి నటుడు ఇప్పుడు మళ్లీ వచ్చి హీరోగా సినిమా అంటే ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే.