టాలీవుడ్లో రీమేక్‌కు పెట్టింది పేరైన స్టార్ హీరోల లిస్టు తీస్తే రాజశేఖర్ ముందు వరుసలో నిలుస్తారు. ఆ తర్వాత ఎక్కువగా రీమేక్‌ల్లో నటించి, ఘనవిజయాలు అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్. చంటి, సుందరకాండ, సూర్యవంశం, రాజా, దృశ్యం, గురు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి వెంకీ కెరీర్లో. ఇప్పుడు ఆయన పూర్తి చేసిన రెండు చిత్రాలూ (నారప్ప, దృశ్యం-2) కూడా రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడైతే తెలుగులో కథల కొరత ఉండేది. వైవిధ్యమైన కథలూ వచ్చేవి కావు. కానీ గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఎంతో పురోగతి సాధించింది. ఒకప్పుడు మనవాళ్లు కథల కోసం ఎక్కువగా ఆధారపడ్డ కోలీవుడ్ వెనుకబడిపోతే.. మనోళ్లు వాళ్లను దాటి ముందుకెళ్లిపోయారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా రీమేక్‌లు చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ‘నారప్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వెంకీ ముందు విలేకరులు ఇదే ప్రశ్న ఉంచితే ఆయన ఏమన్నారంటే..
‘‘రీమేక్‌ల్లో నటించడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. సినిమా నాకు బాగా నచ్చి ఉండొచ్చు. అలాగే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం అంతకుముందు నాకు రాకపోవడం, ప్రేక్షకులకు మంచి కథ అందించాలని అనిపించడం.. నిర్మాతలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా చూసుకోవడం.. ఇలా ఎన్నో అంశాలు రీమేక్‌ల్లో నటించడానికి దోహదం చేస్తాయి.
‘నారప్ప’ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎమోషన్లు ఉన్న కథలు రాలేదు. నేను కూడా అలాంటిది చేయలేదు. ఇందులోని ప్రతి ఎమోషన్‌కూ ప్రేక్షకులు కనెక్టవుతారు. అసలు ‘అసురన్’ లాంటి సినిమానే ఇంతవరకు నేను చూడలేదు. అందుకే రీమేక్ చేస్తే బాగుంటుందనిపించి చేశాం. రీమేక్‌లను ఒరిజినల్‌తో పోల్చి చూడటం ఎప్పుడూ ఉండేదే. సుందరకాండ, చంటి సమయంలోనూ అలా జరిగింది. ఐతే రీమేక్ తీయడం, అందులో నటించడం అంత తేలిక కాదు. మాతృకను చెడగొట్టకుండా జాగ్రత్తగా రీమేక్ చేయాలి. ‘నారప్ప’ విషయంలో శ్రీకాంత్ అడ్డాల ఆ పని చక్కగా నిర్వర్తించాడు’’ అని వెంకీ వివరించాడు.