గాంధీని వదలని నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల కిందట ట్విట్టర్లో పెద్ద వివాదానికే తెర తీశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించాడు. గాంధీని చంపడం నేరమే అయినా.. గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నది నాగబాబు మాట. కానీ నాగబాబు వ్యాఖ్యలు జనాలకు వేరే సంకేతాలు ఇచ్చాయి.
ఈ వ్యాఖ్యల్ని ప్రత్యర్థులు అవకాశంగా మలుచుకున్నారు. వీటిని జనసేనకు ముడిపెట్టి విమర్శలు చేశారు. జనసేన వర్గాల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నాగబాబు తన ట్వీట్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. జనసేనకు సంబంధం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే నాగబాబు ఇంకా కూడా గాంధీని విడిచిపెట్టడం లేదు. లేటెస్టుగా గాంధీతో ముడిపెట్టి కొత్త టాపిక్ మీద ట్వీట్లు వేశారాయన.

కరెన్సీ నోట్లపై ఒక్క గాంధీ బొమ్మ మాత్రమే వేయడం కరెక్ట్ కాదని.. దేశంలో ఎంతోమంది గొప్ప నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారని.. వాళ్లందరూ తర్వాతి తరాలకు గుర్తుండాలంటే అందరి బొమ్మల్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని అభిప్రాయపడ్డారు నాగబాబు.

‘‘Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ఐతే ఈ వ్యాఖ్యలపై యధావిధిగా విమర్శలొచ్చాయి. గాంధీ మీద మీకింత వ్యతిరేకత ఎందుకని కొందరు నాగబాబును తిట్టిపోశారు. కొందరు మాత్రం నాగబాబు చెప్పిందాంట్లో తప్పేముందని.. ఆయన మంచి సూచనే చేశారని మద్దతుగా నిలిచారు.