కొడుకు చాలా ఎదిగిపోయాడంటున్న మ‌హేష్‌

లాక్ డౌన్ స‌మ‌యాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాగా ఎంజాయ్ చేస్తున్న హీరో టాలీవుడ్లో మ‌రొక‌రు ఉండ‌రేమో. అత‌ను కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు అలాంటి ఫీలింగే క‌లిగిస్తున్నాయి మ‌రి. మామూలుగానే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయ‌డానికి చాలా ఇష్ట‌ప‌డ‌తాడు మ‌హేష్‌. లాక్ డౌన్ టైంలో అత‌ను మ‌రింత‌గా ఫ్యామిలీతో బంధాన్ని పెంచుకుంటున్నాడు. త‌న కొడుకు, కూతురితో క‌లిసి ఇప్ప‌టికే అనేక స‌ర‌దా ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. తాజాగా మ‌హేష్ ఒక ఆస‌క్తిక‌ర వీడియో పెట్టాడు. త‌న కొడుకును త‌న ముందు నిల‌బెట్టి అత‌నెంత ఎదిగిపోయాడో చూపించాడు మ‌హేష్‌.

మ‌హేష్ భుజాన్ని దాటి ఎదిగిపోయిన‌.. అత‌డి కంటే ఒక మూణ్నాలుగు అంగుళాలు మాత్ర‌మే త‌క్కువ ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాడు గౌత‌మ్. ప్ర‌స్తుతం గౌత‌మ్ వ‌య‌సు 14 ఏళ్లే. కాబ‌ట్టి టీనేజీ దాటేస‌రికి తండ్రిని మించి ఎత్తుకు చేరుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే లాక్ డౌన్ టైంలో మ‌రింత ఛార్మింగ్‌గా త‌యారైన అత‌ను.. గ్లామ‌ర్ విష‌యంలో కొడుకుతో పోటీ ప‌డుతున్నాడు. వాళ్లిద్ద‌రినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి చూస్తే అన్న‌ద‌మ్ముల్లా క‌నిపిస్తున్నారు. అలాంటి ఫొటోలు, వీడియోలే షేర్ చేస్తున్నాడ‌త‌ను. మొత్తంగా ఈ స‌మ‌యాన్ని చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటూ నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్లుగా ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్‌ను చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు.