యంగ్ హీరోకి అంతిస్తున్నారా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే సూర్య కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తారని అంటున్నారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగు డెబ్యూకి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ హీరో నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.

వీటిల్లో ‘రెమో’ సినిమా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు రెమ్యునరేషన్ గా రూ.20 కోట్లు ఇవ్వబోతున్నారని సమాచారం.

నిజానికి టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్లు అందుకునేది స్టార్ హీరోలే. వాళ్లతో పోలిస్తే శివ కార్తికేయన్ కు తెలుగులో అంత క్రేజ్ లేదు. అలాంటిది ఈ హీరోకి ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కోలీవుడ్ లో ఈ హీరోకి నలభై కోట్ల మార్కెట్ ఉందట. అందుకే ఇరవై కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరో ఇరవై కోట్లలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నిర్మాతకు ఈ సినిమా ఏ రేంజ్ లో లాభాలను తీసుకొస్తుందో చూడాలి!