సుద్దాల అశోక్ తేజ అనారోగ్యంపై క్లారిటీ

టాలీవుడ్ గేయ ర‌చ‌యిత‌ల్లో ఒక‌రైన సుద్దాల అశోక్ తేజ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డ్డార‌ని.. ఆయ‌న‌కు లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేస్తున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆయ‌నకు అలాంటి అనారోగ్యం ఏమీ లేద‌ని, క్షేమంగా ఉన్నార‌ని.. లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ గురించి వ‌స్తున్న వార్త‌లు అబద్ధ‌మ‌ని కూడా ఖండ‌న‌లు వ‌చ్చాయి. దీంతో ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అశోక్ తేజ అభిమానులు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అశోక్ తేజ‌కు వ‌ర‌స‌కు అల్లుడైన ఉత్తేజ్ స్పందించాడు. త‌న మావ‌య్య ఆరోగ్య ప‌రిస్థితిపై ఓ వీడియో ద్వారా స్ప‌ష్ట‌త ఇచ్చాడు.

‘‘మా మావ‌య్య సుద్దాల అశోక్ తేజ గారు అనారోగ్యంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అది నిజమే. అయితే ఆయన హాస్పిట‌ల్లో జాయిన‌వుతున్నారు. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉంది. తన ఫ్రెండ్‌తో మాటమాత్రంగా ర‌క్తం అవసరం ఉంటుందేమో అని చెబితే.. అత‌ను ఫేస్ బుక్‌లో పెట్టేశాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ర‌క్తం అవసరమైంది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేయడం.. వాళ్లు ర‌క్త‌దాత‌ల్ని పంపించ‌డం జ‌రుగుతోంది. మావ‌య్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా థ్యాంక్స్. చిరంజీవి గారు కూడా ఫోన్ చేశారు. మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే ఆయ‌న‌తో మాట్లాడించమ‌ని చెప్పారు. నేను వెంటనే మామయ్యతో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. మొత్తం సినీ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా అనిపించింద‌ని, ఎంతో ధైర్యంగా ఆసుప‌త్రికి వెళుతున్నాన‌ని మామయ్య చెప్పారు. సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనందరి అభిమానం, ప్రేమతో ఆయన సంతోషంగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుంటున్నా’’ అని ఉత్తేజ్ చెప్పాడు.