ఫ్యామిలీ మ్యాన్ త‌ర్వాత ఫేక్


హిందీలో తాము తీసిన సినిమాల‌ను మించి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించారు ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌-డీకే. తెలుగు వారే అయిన ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు.. బాలీవుడ్లో క‌ష్ట‌ప‌డి ఎదిగారు. త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వాళ్ల పేర్లు ఇప్పుడు ఒక బ్రాండ్ అంటే అతిశ‌యోక్తి కాదు. రాజ్-డీకే సొంతంగా తీసే సినిమాలైనా.. వాళ్లు నిర్మించే చిత్రాలైనా చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయ‌న్న పేరుంది.


ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో వాళ్ల‌కొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇండియాలో అత్యంత ఆద‌ర‌ణ పొంది, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించిన సిరీస్‌గా ఇది నిలిచిపోయింది. ఇటీవ‌లే వ‌చ్చిన సీజ‌న్ 2 కూడా సూప‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే.

దీని త‌ర్వాత రాజ్-డీకే.. షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సిరీస్ తీయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ వార్త‌లు నిజ‌మే అని రూఢి అయింది. షాహిద్ ప్ర‌ధాన పాత్ర‌లో ఫేక్ అనే సిరీస్ తీయ‌బోతున్నార‌ట ఈ ద‌ర్శ‌క ద్వ‌యం. ఫేక్ క‌రెన్సీ రాకెట్ నేప‌థ్యంలో ఈ సిరీస్ న‌డుస్తుంద‌ట‌. వ‌చ్చే ఏడాది ఓ ప్ర‌ముఖ ఓటీటీ కోసం ఈ సిరీస్‌ను మొద‌లుపెట్ట‌నున్నార‌ట‌.

ప్ర‌స్తుతం రాజ్‌-డీకే ఫ్యామిలీ మ్యాన్-3 స‌న్నాహాల్లో ఉన్నారు. స్క్రిప్ట్ వ‌ర్క్ న‌డుస్తోంది. ఈసారి ఈ క‌థ భార‌త్‌పై చైనీయుల కుట్ర నేప‌థ్యంలో న‌డుస్తుంది. కోల్‌క‌తాలో క‌థ సాగుతుంది. ఈ దిశ‌గా ఫ్యామిలీ మ్యాన్‌-2 చివ‌ర్లో సంకేతాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది పూర్త‌య్యాక ఫేక్ సిరీస్‌ను ప‌ట్టాలెక్కిస్తారు. షాహిద్ క‌పూర్‌కు ఇదే తొలి వెబ్ సిరీస్ కావ‌డం విశేషం.