దుల్కర్ సినిమాలో అక్కినేని హీరో!

హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సుమంత్ కి ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. నాలుగేళ్ల క్రితం ఈ హీరో నటించిన ‘మళ్లీ రావా’ సినిమా సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో సుమంత్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు లేక వెండితెరకు దూరమయ్యాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో దుల్కర్ లెఫ్టనెంట్ రామ్ అనే పాత్రలో కనిపించనున్నారు.

1964లో జరిగిన పీరియాడిక్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కేక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం స్పెషల్ సెట్ ను నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ తో పాటు ఎప్పుడూ ఉండే ఓ క్యారెక్టర్ లో సుమంత్ కనిపించబోతున్నారట. ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాను స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో సుమంత్ ఫేట్ ఏమైనా మారుతుందేమో చూడాలి!