రామ్ కోసం అదిరిపోయే టైటిల్

చూడ్డానికి క్లాస్‌గా కనిపిస్తాడు కానీ.. రామ్ చేసేవి చాలా వరకు మాస్ పాత్రలే. అతడికి సరైన మాస్ క్యారెక్టర్ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ‘ఇస్మార్ట్ శంకర్’తో రుజువు చేశాడు. ఈ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్.. తర్వాత ‘రెడ్’తోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మరీ పెద్ద హిట్టయిపోకున్నా.. డీసెంట్ కలెక్షన్లతో నిర్మాత, బయ్యర్లకు మంచి ఫలితాన్నే అందించింది.

ఇప్పుడతను తమిళ సీనియర్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే షూటింగ్ మొదలు కాకముందే ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు చెబుతున్నారు. ‘ఉస్తాద్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఈ సినిమాకు పెట్టారట. ఈ వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఈ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం. ఇదే నిజమైతే రామ్ అభిమానులకు పండగ అన్నట్లే.

రామ్‌ను అభిమానులు ఉస్తాద్ అని పిలుచుకుంటారు. రామ్ పీఆర్వో టీం కూడా అతడి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటపుడు పేరు ముందు ఉస్తాద్ అనే పదం వాడుతుంటుంది. ఐతే పవర్ స్టార్ పవన్ అభిమానులు మాత్రం ‘ఉస్తాద్’ అనే పదం తమ హీరోకే నప్పుతుందని అంటుంటారు. రామ్‌కు ఈ టైటిల్ వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా రామ్ సినిమాకు ‘ఉస్తాద్’ అని పెట్టేశారంటే ఇక అతడికి అది శాశ్వతంగా సొంతం అయిపోయినట్లే.

సినిమా హిట్టయితే ‘ఎనర్జిటిక్ స్టార్’ అని తీసేసి ‘ఉస్తాద్’ అనే బిరుదును పర్మనెంట్ చేసేస్తారేమో. రన్, పందెం కోడి, వేట్టై లాంటి చిత్రాలతో లింగుస్వామి మంచి మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన కొన్నేళ్ల నుంచి ఫాంలో లేడు. సికిందర్, పందెంకోడి-2 చిత్రాలు డిజాస్టర్లయ్యాయి. మరి రామ్ సినిమాతో మళ్లీ మునుపటి ఫామ్ చూపిస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.