సినీ నటుడు, రాజకీయ సునిశిత విమర్శకుడు కత్తి మహేష్ ఇక లేరు. కొన్నాళ్ల కిందట నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయంతెలిసిందే. ఈ క్రమంలో ఆయన కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వైద్య ఖర్చులకు రూ.17 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పగా.. ఏపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని తక్షణమే మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని.. ప్రాణాలకు ఇబ్బంది లేదని.. అందరూ అనుకున్నారు. త్వరలోనే తాను కొలుకుని వస్తానని.. కత్తి మేహేష్.. ట్వీట్ కూడా చేయడంతో ఆయన అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఒకింత సంతోషం వ్యక్తమైంది.
అయితే.. కొద్ది సేపటి కిందట.. ఆరోగ్యం విషమించి కత్తి మహేష్ కన్నుమూశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర శోకంలో ముగినిపోయారు. ఇదిలావుంటే, కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్‌లోనూ నటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో పట్టభద్రుడైన ఆయన 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథ ఆధారంగా ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశారు. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించారు. పెసరట్టు (సినిమా) అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశారు. హృదయ కాలేయం చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారు.
రాజకీయంగా నిశిత విమర్శలు చేయడంలోనూ కత్తి మహేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్‌పై రాజకీయంగా విమర్శలు చేసి.. నిత్యం వార్తల్లో నిలిచారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న ఆయనపై సమాజంలో ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, అతనికి ఆరు నెలలపాటు హైదరాబాదు నగర బహిష్కరణ విధించారు. కత్తి మహే్‌షను చిత్తూరులోని అతని స్వస్థలానికి తరలించారు. ఇలా.. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే కత్తి మహేష్.. ఆకస్మికంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు.. తుక్కుతుక్కయింది. తీవ్రంగా గాయపడిన ఆయన.. మరలిరాని లోకాలకు తరలిపోయారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్.. అహరహం.. ప్రజల పక్షాన నిలవడం.. రాజకీయంగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates