స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్, అలానే సల్మాన్ కి చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సభ్యులు ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు తనను సంప్రదించి ఆ సంస్థ ఫ్రాంచైజీను తెరవమని అడిగినట్లు అరుణ్ గుప్తా చెప్పారు.
దీనికోసం రెండు నుండి మూడు కోట్లు ఖర్చువుతుందని.. కావాల్సిన బ్యాకప్ మొత్తం ఏర్పాటు చేయడంతో పాటు సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొంటారని చెప్పినట్లు అరుణ్ గుప్తా తెలిపారు. వారి మాటలను నమ్మి అంత మొత్తాన్ని ఖర్చుపెట్టారట. అయితే షోరూమ్ తెరిచి సంవత్సరం గడుస్తున్నా.. ఇప్పటివరకు తనకు రావాల్సిన స్టాక్ ను పంపించలేదని తెలిపారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్ తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారని.. ఈ క్రమంలో సల్మాన్ ను కలిసినట్లు అరుణ్ గుప్తా తెలిపారు.
ఆయన షోరూమ్ ప్రారంభోత్సవానికి వస్తానని హామీ ఇచ్చారట. కానీ తరువాత సల్మాన్ రాలేదని.. ఆయనకు బదులుగా ఆయుష్ శర్మను (సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్త) పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. షోరూమ్ ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదని వాపోయాడు. ఈ మేరకు సల్మాన్ ఖాన్. ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ సంస్థ సీఈఓ ప్రకాష్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.