ఫస్ట్ లుక్ రాలేదు.. బిజినెస్ మొత్తం ఫినిష్


తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్లంటే విజయ్, అజిత్‌లే. ఈ ఇద్దరూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించి ఎదిగిపోయారు. రజినీ సినిమాలను మించి వీరి చిత్రాలకు బిజినెస్ జరుగుతోంది. వాళ్ల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బద్దలైపోతున్నాయి. అజిత్ నుంచి రెండేళ్ల కిందట వచ్చిన ‘విశ్వాసం’ సగటు మాస్ మసాలా మూవీనే. కానీ అది అప్పటికి ఉన్న తమిళనాడు వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయడం విశేషం. దీని తర్వాత ‘పింక్’ రీమేక్ ‘నీర్కొండ పార్వై’ కూడా మంచి విజయమే సాధించింది.

ఐతే అజిత్‌ను పూర్తి స్థాయి యాక్షన్ మూవీలో చూడాలన్న అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే అతను ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కార్తితో ‘ఖాకి’ సినిమా.. అలాగే అజిత్‌తో ‘నీర్కొండ పార్వై’ తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాత. తెలుగు నటుడు కార్తికేయ ఇందులో విలన్ పాత్ర చేస్తుండటం విశేషం.

కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ‘వాలిమై’కి సంబంధించి ఇప్పటిదాకా అఫీషియల్‌గా ఒక్క అప్ డేట్ లేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. ‘వాలిమై’ అనే టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఐతేనేం ఈ సినిమాపై క్రేజ్ పీక్స్‌లో ఉంది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఎంత భరోసా ఉందంటే.. ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ కాకుండానే టోటల్ బిజినెస్ పూర్తయిపోయిందట. థియేట్రికల్ హక్కులు అమ్మేశాడు. డిజిటల్ డీల్స్ పూర్తయ్యాయి. అలాగే శాటిలైట్ హక్కులను కూడా అమ్మేశారట.

అజిత్ ఒక సినిమాను అనౌన్స్ చేయడమే ఆలస్యం.. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్‌లు పట్టుకుని నిర్మాత దగ్గర వాలిపోతుంటారు. అందులోనూ అతను వరుస విజయాలతో దూకుడు మీదుండటం.. క్రేజీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుండటంతో ‘వాలిమై’పై అంచనాలు మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. రూ.200 కోట్లకు పైగానే ఈ చిత్రానికి బిజినెస్ జరిగిందని.. బోనీ కపూర్ ఈ చిత్రంతో భారీగా వెనకేసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ‘వాలిమై’ ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.