కేవలం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి బాగానే నిలదొక్కుకుంది ‘ఆహా’ ఓటీటీ. కరోనా-లాక్ డౌన్ అల్లు వారి ఓటీటీకి బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. కాకపోతే ఇందులో చాలా వరకు ఉండేవి చిన్న సినిమాలు, సిరీస్‌లే. వేరే భాషల నుంచి కాస్త పెద్ద సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు కానీ.. తెలుగు చిత్రాలపై మాత్రం పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టట్లేదు ఆహా.
ఇప్పటిదాకా ఆ ఓటీటీలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా అంటే ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఇందులో రిలీజైన చిత్రాల్లో ‘కలర్ ఫొటో’ కొంచెం పెద్ద స్థాయిది. వేరే ఓటీటీల్లో రిలీజైన క్రేజీ సినిమాలను సెకండ్ హ్యాండ్‌లో కొంచెం లేటుగా ఆహాలో రిలీజ్ చేయడమూ చూశాం. ఐతే ఈ మధ్య ‘ఆహా’ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లుంది. కొంచెం పెద్ద స్థాయిలోనే పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తోంది.
వరుసబెట్టి పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్‌లు తీస్తూనే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి తీసుకొస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘లవ్ స్టోరి’ గురించే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. మళ్లీ థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిచే సమయానికి ‘లవ్ స్టోరి’ వచ్చేస్తుంది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రాన్ని ఆహాలోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగానే ప్రకటించింది. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. నాగశౌర్య చిత్రం ‘లక్ష్య’ డిజిటల్ హక్కులను ఆహానే సొంతం చేసుకుంది. ఈ చిత్రాల వరుస చూస్తుంటే ఆహా మరో స్థాయికి వెళ్తున్నట్లే కనిపిస్తోంది.