వైఎస్ఆర్ బయోపిక్ ఆధారంగా గతంలో ‘యాత్ర’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ఆర్ పాత్రలో ఆయన ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ గా సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు.
జగన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ముందుగా ‘రంగం’ ఫేమ్ నటుడు అజ్మల్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ‘స్కామ్ 1992’లో నటించిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. అతడి రాకతో ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన్నే ఫైనల్ చేయబోతున్నారు.
వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ‘యాత్ర 2’ మొదలవుతుంది. ఆ సమయంలో జగన్ ఎలా ఉండేవారు..? తండ్రి మరణం తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఓ రాజకీయనాయకుడిగా ప్రజలకు ఎలా మెప్పించగలిగాడనే విషయాలతో ‘యాత్ర 2’ని తెరకెక్కించబోతున్నారు. మరి ఇందులో జగన్ అక్రమాస్తుల కేసుల గురించి కూడా చూపిస్తారేమో చూడాలి!
Gulte Telugu Telugu Political and Movie News Updates