రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ డైరెక్టర్!

‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ ఇలాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ప్రసన్న కుమార్ అనే రైటర్ తో కలిసి తన సినిమాలను రూపొందిస్తుంటారు. కథ, మాటలు ప్రసన్న రాస్తే.. దాన్ని త్రినాధరావు తెరకెక్కిస్తారు. అయితే చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ప్రసన్న కుమార్ మొత్తం పనులన్నీ చూసుకుంటే త్రినాధరావు కేవలం పర్యవేక్షణ చేస్తుంటారని టాక్.

తాజాగా దీనిపై దర్శకుడు త్రినాధరావు క్లారిటీ ఇచ్చారు. ప్రసన్న కుమార్ వర్క్ కేవలం కథ, మాటలను వరకేనని స్పష్టం చేశారు. ప్రసన్న రాసే డైలాగ్స్ లో కృష్ణా జిల్లా యాస ఉంటుందని.. ఎలా పలకాలో ప్రసన్న చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో అతడిని సెట్స్ కి రమ్మంటానని ప్రసన్న తెలిపారు. అంతేతప్ప డైరెక్షన్ కు, ప్రసన్నకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

అయితే ప్రసన్నను దర్శకుడిగా ప్రయత్నించమని ప్రోత్సహించానని.. రెండు, మూడు సార్లు ప్రయత్నించి మరింత కసరత్తు చేయాలని తన దగ్గరకు తిరిగి వచ్చేశాడని త్రినాధరావు తెలిపారు. ప్రస్తుతం రవితేజ సినిమా స్క్రిప్ట్ రెడీ అయిందని.. షూటింగ్ కి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలానే చాలా రోజులుగా వెంకటేష్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వెంకీతో సినిమా ప్లాన్ చేసినప్పుడే కరోనా వచ్చి ఆలస్యమైందని అన్నారు. త్వరలోనే ఆయనతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.