ఓటీటీలోకి మరో భారీ చిత్రం


థియేటర్లలో సినిమాలు లేక, ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు రాక సినీ ప్రియుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వారం వారం కొత్త సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇది సంకట స్థితే. లాక్ డౌన్ షరతులను సడలించి థియేటర్లకు వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే పేరున్న కొత్త చిత్రాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు నెమ్మదిగా ఓటీటీ బాట పడుతున్నారు.

తెలుగులో ఇప్పటికే మాస్ట్రో, నారప్ప, దృశ్యం-2 లాంటి చిత్రాలను ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటి గురించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఈలోపు ఓ తమిళ బిగ్ బడ్జెట్ మూవీ.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుంది. చిన్న చినన పాత్రలతో మొదలుపెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డాక్టర్’ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది.

‘డాక్టర్’ సినిమాను హాట్ స్టార్ మంచి రేటు పెట్టి కొనేసింది. తమ ఫ్లాట్ ఫాంలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు హాట్ స్టార్ అధికారికంగానే ప్రకటించింది. ఇంతకుముందు నయనతారతో ‘కోలమావు కోకిల’ (తెలుగులో కోకో కోకిల) చిత్రాన్ని రూపొందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ‘డాక్టర్’ను రూపొందించాడు. రెండో సినిమా విడుదల కాకముందే అతడికి విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం లభించింది. వీరి కలయికలో రూపొందుతున్న ‘బీస్ట్’ ఇటీవలే ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే.

‘బీస్ట్’ కంటే ముందు నెల్సన్ తీసిన ‘డాక్టర్’ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలల కిందటే ఈ సినిమా పూర్తయినప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఐతే ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీ రిలీజ్‌కు ఈ సినిమాను రెడీ చేసేశారు. ‘గ్యాంగ్ లీడర్’ భామ ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో కథానాయికగా నటించింది.