రేప్ కేసుపై స్పందించిన నటుడు!

‘నాగిని 3’ ఫేమ్ పరల్ వి పూరిను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ బాలికను కిడ్నాప్ చేసి కారులో లైంగిక దాడి చేశాడని.. పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పరల్ తో పాటు అతడి స్నేహితులపై కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పలువురు బుల్లితెర నటులు, నిర్మాత ఏక్తా కపూర్.. పరల్ వి పూరికి మద్దతుగా నిలిచారు.

రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చిన పరల్ దాదాపు రెండు వారాల తరువాత మొదటిసారి ఈ కేసుపై నోరు విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటుందని అన్నారు. ఇటీవల తన నాన్నమ్మను కోల్పోయానని.. ఆమె చనిపోయిన 17రోజులకు తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని పరల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ భయంకరమైన ఆరోపణలు తనపై వచ్చాయని.. అప్పటినుండి ప్రతిరోజూ పీడకలలు తనను వెంటాడుతున్నాయని.. ఇవన్నీ తనను కలచి వేశాయని ఆవేదన వ్యకతం చేశారు.

తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఆమె పక్క లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ ఈ సంఘటనల నుండి బయటపలేకపోతున్నానని చెప్పారు. అయితే తనకు అండగా నిలిచిన స్నేహితులకు, మద్దతు తెలిపిన సన్నిహితులకు కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో బాధితురాలైన బాలికకు పదేళ్ల క్రితమే వివాహం జరిగిందని.. రెండేళ్లుగా ఆమె కనిపించడం లేదని బాధితురాలు తల్లి కోర్టుకి వెల్లడించింది. అంతేకాకుండా పరల్ వి పూరికి మద్దతిస్తూ.. ఈ కేసుకి అతడికి సంబంధం లేదని.. ఇవి ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేసింది.