సంచ‌ల‌న కేసు నేప‌థ్యంలో స్టార్ హీరో సినిమా

సామాజిక స‌మ‌స్య‌ల మీద సినిమాల్లోనే కాక‌.. బ‌య‌ట కూడా గ‌ట్టిగా గ‌ళాన్ని వినిపిస్తుంటాడు త‌మిళ స్టార్ హీరో సూర్య‌. త‌మిళనాట మ‌హిళ‌ల మీద అఘాయిత్యాలు జ‌రిగిన‌పుడు.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో సూర్య ఆవేద‌న‌తో స్పందించ‌డం చూస్తూనే ఉంటాం. త‌మ‌ అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్య‌క్రమాలు నిర్వ‌హించ‌డ‌మే కాక‌.. ఏవైనా బ‌ర్నింగ్ ఇష్యూస్ న‌డుస్తున్న‌పుడు బాధితుల త‌ర‌ఫున సూర్య వాయిస్ వినిపిస్తుంటాడు. త‌న సినిమాల ద్వారా కూడా ఏదో ఒక మంచి చెప్పాల‌నే ప్ర‌య‌త్నిస్తుంటాడ‌త‌ను.

ప్ర‌స్తుతం సూర్య చేస్తున్న ఓ సినిమా కూడా ఓ సామాజిక స‌మ‌స్య చుట్టూ తిరిగేదే. త‌మిళ‌నాట సంచ‌ల‌నం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్టైన్మెంట్‌లోనే ఇది తెర‌కెక్కుతోంది.

రెండేళ్ల కింద‌ట త‌మిళ‌నాడులోని పొల్లాచ్చిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం వ‌ల్ల కొన్ని రోజుల పాటు త‌మిళ‌నాడు అట్టుడికిపోయింది. అప్ప‌ట్లో రాజ‌కీయంగా కూడా ఇది దుమారం రేపింది. సూర్య స‌హా సెల‌బ్రెటీలంద‌రూ అప్ప‌ట్లో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే పాండిరాజ్.. సూర్య కొత్త చిత్రానికి క‌థ అల్లాడట‌. ఇందులో సూర్య అమ్మాయిల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డే వారిని వేటాడే వ్య‌క్తిగా క‌నిపిస్తాడ‌ట‌.

రాఖీ లాంటి సినిమాలు ఇలాంటి క‌థ‌ల‌తో తెర‌కెక్కిన‌వే. ఐతే పాండిరాజ్ ట్రీట్మెంట్ కొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు. సూర్య గ‌త సినిమాల్లాగే ఇది కూడా త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. గ్యాంగ్ లీడ‌ర్, శ్రీకారం చిత్రాల క‌థానాయిక ప్రియాంక అరుల్ మోహ‌న్.. ఈ చిత్రంలో సూర్య‌కు జోడీగా న‌టిస్తోంది. ఆమెకిదే తొలి త‌మిళ చిత్రం.