అనుకున్నట్లుగానే మంచు విష్ణు కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రేసులోకి వచ్చేశాడు. తాను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లు విష్ణు ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తాను తెలుగు సినిమాల్లోనే పెరిగి పెద్దయ్యానని.. సినిమా పరిశ్రమ కష్టాలు, సమస్యలు చూస్తూ పెరిగిన తనకు ‘మా’ సభ్యుల మనోభావాలు, బాధలు బాగా తెలుసని.. తమ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన సినీ పరిశ్రమ రుణం తీర్చుకోవడానికి.. పరిశ్రమకు సేవ చేయడానికి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు విష్ణు. ఇవన్నీ రొటీన్ మాటలే కానీ.. మంచు విష్ణు ప్రకటనలో ‘మా’ సభ్యులను ఆకర్షించే అంశం ఒకటుంది. అదే ‘మా’కు సొంత భవనం నిర్మించుకునే అంశం. ఈ విషయంలో విష్ణు ఒక ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇంతకుముందు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం తాను ఇస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని విష్ణు గుర్తు చేశాడు. అయితే బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పాడు. ‘మా’ అధ్యక్ష పదవికి ఇప్పటికే పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్.. తన లక్ష్యం ‘మా’కు భవనం కట్టి ఇవ్వడమే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఆయన ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
ఐతే విష్ణు ‘మా’ భవన నిర్మాణానికి 25 శాతం నిధులు అందజేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేయడం ద్వారా.. భవిష్యత్తులో ఆ పని మొదలైతే ఈ హామీని నిలబెట్టుకుంటానని చెప్పకనే చెప్పినట్లయింది. ఐతే ‘మా’కు భవనం కేటాయించడం ఇక్కడ పెద్ద సమస్య. ప్రభుత్వం దశాబ్దాలుగా ఈ హామీని నెరవేర్చలేకపోతోంది. స్థలం ఇస్తే భవన నిర్మాణానికి 25 శాతం నిధులు ఇవ్వడానికి విష్ణు ముందుకొచ్చే అవకాశముంది. ప్రకాష్ రాజ్ ‘మా’కు భవనం కట్టించే ప్రతిపాదన గురించి మాట్లాడుతుంటే.. విష్ణు తన తరఫున 25 శాతం నిధుల హామీ గురించి మాట్లాడి ఒక అడుగు ముందుకు వేసేశాడనే చెప్పాలి. మరి ఈ మాటలు ‘మా’ సభ్యులను ఏ మేర ఆకర్షిస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates