మ‌న స్టార్లెందుకు న‌మ్మ‌రు?


శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసి ద‌శాబ్దంన్న‌ర దాటింది. ఈ కాలంలో ఆయ‌న్నుంచి మంచి మంచి సినిమాలు వ‌చ్చాయి. హ్యాపీడేస్, ఫిదా లాంటి సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స‌త్తాను చూపించాడు క‌మ్ముల‌. పెద్ద స్టార్లేమీ లేకుండానే ఆయ‌న అంత భారీ విజ‌యాల‌ను అందుకున్నాడు. అలాంటిది శేఖ‌ర్ స్టార్ల‌తో జ‌ట్టు క‌ట్టి.. మంచి సినిమా తీస్తే వాటి స్థాయే వేరుగా ఉంటుంద‌న్న అంచ‌నాలున్నాయి.

కానీ క‌మ్ముల ఇప్ప‌టిదాకా ఒక్క పెద్ద స్టార్‌తోనూ సినిమా చేయ‌లేక‌పోయాడు. తాను స్టార్ల‌తో సినిమాలు చేయ‌డానికి రెడీ అంటుంటాడు కానీ.. ఇత‌ను వాళ్ల‌ను సంప్ర‌దించ‌డా.. లేక వాళ్లే ఇత‌డితో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌రా అన్న‌ది అర్థం కాదు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. క‌మ్ముల శిష్యుడైన నాగ్ అశ్విన్ రెండు క్లాస్ సినిమాలే తీసి ఏకంగా ప్ర‌భాస్‌తో సినిమా చేసే అవ‌కాశం ప‌ట్టేశాడు. కానీ శేఖ‌ర్ మాత్రం ఇప్ప‌టిదాకా తెలుగులో పెద్ద స్టార్‌తో ఒక్క సినిమా కూడా చేయ‌లేక‌పోయాడు.

ఇప్పుడు ల‌వ్ స్టోరీలో న‌టించిన నాగ‌చైత‌న్య‌నే క‌మ్ముల ఇప్ప‌టిదాకా చేసిన హీరోల్లో కొంచెం రేంజ్ ఉన్నవాడు. ఆ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు హిట్ట‌యితే అయినా బ‌డా స్టార్లు క‌మ్ముల‌తో సినిమా చేస్తారేమో అనుకుంటే ఆ చిత్రం వాయిదా ప‌డింది. ఈలోపు ఆశ్చ‌ర్య‌కరంగా త‌మిళ స్టార్ ధ‌నుష్‌.. క‌మ్ముల‌తో సినిమాను ఓకే చేశాడు. వీరిలో ఎవ‌రు ముందు అడుగు వేసి సంప్ర‌దింపులు జ‌రిపారో తెలియ‌దు.

ఐతే మ‌న స్టార్లు న‌మ్మ‌ని క‌మ్ముల‌ను త‌మిళంలో పెద్ద స్టార్ అయిన ధ‌నుష్ న‌మ్మ‌డం ఆశ్చర్యం క‌లిగించే విష‌యం. ఇది చూసి మ‌న హీరోల‌కు క‌మ్ముల మీద ఈమాత్రం భ‌రోసా క‌ల‌గ‌లేదేంటి అని అత‌డి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రి ధ‌నుష్‌తో పెద్ద హిట్ ఇస్తే అయినా క‌మ్ముల‌తో మ‌న బ‌డా స్టార్లు సినిమాలు చేస్తారేమో చూడాలి.