దిల్ రాజు సేఫ్ గేమ్


నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్లో ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. సినిమాల క్వాలిటీ ప‌రంగా చూసుకున్నా, క్వాంటిటీ ప‌రంగా చూసుకున్నా ఆయ‌న టాలీవుడ్లో ఇప్పుడు టాప్ ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌రు. రెండు ద‌శాబ్దాలుగా ఆయ‌న నిల‌క‌డ‌గా టాలీవుడ్లో త‌న ఆధిప‌త్యాన్ని చాటుతున్నారు. ఐతే ఇప్పుడు రాజుకు దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాల‌ని ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఓవైపు విజ‌య్‌తో ద్విభాషా చిత్రం ద్వారా త‌మిళంలో అడుగు పెట్ట‌బోతున్నాడు. మ‌రోవైపు బాలీవుడ్లో వ‌రుస‌గా మూడు సినిమాలు నిర్మిస్తూ ఉత్త‌రాదినా తన ప్రాబ‌ల్యాన్ని చాటి చెప్పాల‌ని చూస్తున్నాడు. ఐతే హిందీలో రాజు చేస్తున్న మూడు చిత్రాలూ రీమేక్‌లే కావ‌డం విశేషం. ముందుగా జెర్సీ రీమేక్‌ను మొదలు పెట్టిన రాజు.. ఆ త‌ర్వాత ఎఫ్‌-2 రీమేక్‌ను లైన్లోకి తెచ్చాడు. తాజాగా నాంది రీమేక్‌ను కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఆయ‌న్ని రీమేక్ రాజు అనేస్తున్నారు అంద‌రూ.

ఐతే బాలీవుడ్లో రాజు తెలివిగా అడుగులు వేస్తున్నాడ‌న్న‌ది స్ప‌ష్టం. త‌న‌కు గ్రిప్ లేని ఇండ‌స్ట్రీలో నేరుగా స్ట్రెయిట్ చిత్రాలు… అందులోనూ భారీ స్థాయివి తీసి రిస్క్ చేయ‌డం ఎందుకని రాజు ఆలోచిస్తున్న‌ట్లుంది. తెలుగులో బాగా ఆడిన క‌థ‌లు తీసుకుని, పేరున్న బాలీవుడ్ నిర్మాత‌ల‌తో క‌లిసి అక్క‌డ సేఫ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాలు క‌చ్చితంగా మంచి విజ‌యం సాధిస్తాయని అంచ‌నా వేస్తున్నారు.

ఇవి వ‌ర్క‌వుట్ అయి ముందు బ‌ల‌మైన పునాది ప‌డితే.. ఆ త‌ర్వాత రాజు బాలీవుడ్లో ఆధిప‌త్యం చ‌లాయించ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. ఎలాగూ ప్ర‌భాస్-ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు రాజు. అది బాహుబ‌లి త‌ర‌హా భారీ సినిమా అంటున్నారు. ముందు ఇప్పుడు చేస్తున్న చిత్రాల‌తో రాజు ఏంటో బాలీవుడ్‌కు తెలుస్తుంది. త‌ర్వాత ప్ర‌భాస్-ప్రశాంత్ సినిమాతో ఒక్క‌సారిగా విజృంభించి టాప్ ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకుంటాడేమో.