పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి పుష్ప. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇందులో విలన్ పాత్రకు మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ఎంపిక కావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
మలయాళంలో అద్భుతమైన పాత్రలతో ఫాహద్ తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య ఓటీటీల్లో ఫాహద్ సినిమాలు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు అతడి స్థాయి ఏంటో తెలుస్తోంది. కుంబలంగి నైట్స్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఫాహద్ నటన చూసిన వాళ్లకు పుష్ప సినిమాలో సుకుమార్ అతణ్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. బన్నీతో అతడి కలయికలో ఎలాంటి సీన్లు ఉంటాయో అన్న ఎగ్జైట్మెంట్ కలగడం ఖాయం.
ఐతే పుష్పను ఈ మధ్యనే రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో అందుకు తగ్గట్లు స్క్రిప్టును మార్చాల్సి వచ్చింది. ఫాహద్ ఫాజల్ పాత్రను బేస్ చేసుకునే ఈ కథను రెండుగా విభిజించినట్లు సమాచారం. ఆ పాత్రకు ఫస్ట్ పార్ట్‌లో స్క్రీన్ టైం చాలా తక్కువట. రెండో పార్ట్‌కు ఫాహద్ పాత్ర హైలైట్ అయ్యేలా సెట్ చేశాడట సుకుమార్. ఫస్ట్ పార్ట్‌లో వేరే హైలైట్లు చాలా ఉండటంతో ఈ పాత్రను చివరి 20 నిమిషాల్లోనే రంగ ప్రవేశం చేయిస్తున్నాడట.
అంతకుముందు వరకు బన్నీకి వేరే విలన్లతో వైరం నడుస్తుంది. బన్నీ-ఫాహద్ మధ్య రసవత్తరంగా ఉండే ఒక ఫేసాఫ్ సీన్‌తో సినిమాను ముగిస్తారని.. పార్ట్-2లో వీరి మధ్య ఎత్తులు పైఎత్తులతో కథ నడుస్తుందని.. దానికి సంబంధించి కథను మరింత విస్తరించి స్క్రిప్టును పకడ్బందీగా తీర్చిదిద్దాల్సి ఉందని సమాచారం. జూన్ మొదటి వారంలో పుష్ప కొత్త షెడ్యూల్ మొదలవుతుందని.. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌తోనే పార్ట్-1 షూటింగ్ దాదాపు అయిపోతుందని సమాచారం. ఫాహద్ తొలిసారిగా పుష్ప సెట్లో అడుగు పెట్టేది ఈ షెడ్యూల్‌లోనేనట.