మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష స్థానానికి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానని స్వయంగా వెల్లడించటం తెలిసిందే. ఈ ప్రకటన సినిమా ఇండస్ట్రీలోనూ.. బయటా హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఆయనకు పోటీగా ఎవరు ముందుకు వస్తారన్న చర్చ మొదలైంది. దీనిపై తాజాగా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు మోహన్ బాబు కుమారుడు కమ్ యువ హీరో మంచు విష్ణు ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు. తన పోటీకి సంబంధించిన సన్నిహితులతో విష్ణు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ అభ్యర్థిత్వానికి మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు ఇప్పటికే స్పందించటం తెలిసిందే.
మరోవైపు మంచు ఫ్యామిలీకి చిరంజీవి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో.. తాను బరిలోకి దిగాలన్న నిర్ణయాన్ని చిరుతో చర్చించిన తర్వాతే విష్ణు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా మంచు విష్ణు ఎన్నికల్లో ఎంట్రీ ఇస్తారన్న సమాచారంతో ‘మా’ ఎన్నికల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అదే నిజమైతే ఎన్నికలు ఈసారి భిన్నమైన వాతావరణంలో సాగుతాయని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates