బయోపిక్ తో సినిమా తీస్తున్న ఎల్బీ శ్రీరామ్!

గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన కొన్ని సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇప్పటికీ కొన్ని బయోపిక్స్ సెట్స్ పై ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ కు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా జీవితం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఎల్బీ శ్రీరామ్ మంచి రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే. ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ లాంటి హిట్ సినిమాలకు రైటర్ గా పని చేశారాయన. డైలాగ్ రైటర్ గా నంది అవార్డులను సైతం అందుకున్నారు. వెండితెరపై చక్కటి కథలను ప్రెజంట్ చేయాలని తపన పడుతుంటారు ఎల్బీ శ్రీరామ్. దర్శకుడిగా సినిమాలు చేయాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు.

ఎల్బీ శ్రీరాం హార్ట్ ఫిలింస్ అనే పేరుతో లఘు చిత్రాల నిర్మాణం చేపట్టిన ఆయన కొన్నాళ్ల క్రితం ‘డోలు సన్నాయి’ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటే ఈ షార్ట్ ఫిలిం ఆయనకు అవార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడొక ఫీచర్ ఫిలిం చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే గుర్రం జాషువా బయోపిక్. ఈ సినిమా కోసం ఇతర రచయితల సాయం కూడా తీసుకొని స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో పడ్డారాయన. తక్కువ కులంలో జన్మించిన కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న గుర్రం జాషువా తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఎదిగారు. సినిమాగా తీయడానికి ఆయన జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మరి ఈ కథ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి!