ఇంత క‌ష్ట‌ప‌డుతున్నాడు.. ఫ‌లిత‌ముంటుందా?

ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వేషాలుండే పాత్ర‌లు వేయడంలో క‌మ‌ల్ హాస‌న్ సిద్ధ‌హ‌స్తుడు. మేక‌ప్ విష‌యంలో ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో, ఎలా అవ‌తారాలు మార్చుకుంటాడో చాలా సినిమాల్లో చూశాం. ఆయ‌న త‌ర్వాత ఆ స్థాయిలో పాత్ర‌ల్లో వైవిధ్యం కోసం క‌ష్ట‌ప‌డే న‌టుడు విక్ర‌మ్. క్యారెక్ట‌ర్ కోసం ఏం చేయ‌డానికైనా అత‌ను సిద్ధంగా ఉంటాడు.

సేతు సినిమాలో హీరో పాత్ర‌లో న‌ల్ల‌గా క‌నిపించ‌డం కోసం గంట‌లు గంట‌లు ఎండ‌లో నిల‌బ‌డ్డ క‌మిట్మెంట్ అత‌డిది. ఇలా ఎన్నో పాత్ర‌ల కోసం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు విక్ర‌మ్. కానీ ఎంత చేస్తున్నా స‌రే.. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో అత‌ను కోరుకున్న విజ‌యం ఒక్క‌టీ రాలేదు. ప‌దే ప‌దే మేక‌ప్‌తో అత‌ను చేసే మ్యాజిక్స్.. ఒక ద‌శ దాటాక మొహం మొత్తేశాయి. ఇంకొక్క‌డు అనే సినిమాలో అత‌డి ప్ర‌యాస చూసి.. ఇక ఇలాంటివి చాలు మ‌హాప్ర‌భో అనేశారు ప్రేక్ష‌కులు. అయినా స‌రే.. విక్ర‌మ్ మాత్రం మార‌లేదు.

ప్ర‌స్తుతం విక్ర‌మ్ హీరోగా కోబ్రా అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా టీజ‌ర్ చూస్తే.. విక్ర‌మ్ మ‌ళ్లీ వేషాలు మార్చే పాత్ర‌నే చేస్తున్న‌ట్లుగా క‌నిపించింది. టీజ‌ర్ ప‌ట్ల ఎక్కువ‌గా వ్య‌తిరేక‌తే వ్య‌క్త‌మైంది. ఐతే డిమాంటి కాల‌నీ, అంజ‌లి ఐపీఎస్ లాంటి మంచి థ్రిల్ల‌ర్లు తీసిన అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ సినిమాతోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడ‌నే అంచ‌నాలున్నాయి.

తాజాగా విక్ర‌మ్ కొత్త లుక్ ఒక‌టి ఈ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. అందులో ఉన్న‌ది విక్ర‌మ్ అంటే న‌మ్మ‌డం క‌ష్టం. అంత కొత్త‌గా ఉన్నాడు. లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు. న‌ల్ల‌గ‌డ్డం, తెల్ల మీసం రింగులు తిరిగి, నెరిసిన జుట్టుతో న‌డి వ‌య‌స్కుడిగా విక్ర‌మ్ స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఈ మేక‌ప్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డి ఉంటాడో అంచ‌నా వేయొచ్చు. కానీ ఈ క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ద‌క్కుతుందా.. ఎప్ప‌ట్లాగే విక్ర‌మ్ కేవ‌లం వేషాల‌తో మురిపించి మిగ‌తా విష‌యాల్లో నిరాశ‌కు గురి చేస్తాడా అన్నదే చూడాలి.