యండమూరి వీరేంద్ర నాథ్.. తెలుగు వాళ్లు ఎప్పటికీ మరిచిపోలేని అసాధారణ రచయిత. తెలుగులో ఆయన్ని మించిన గొప్ప రచయితలు ఉండొచ్చు కానీ.. ఆయనలా కొన్ని తరాలను ఉర్రూతలూగించిన ఎంటర్టైనింగ్ రైటర్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తన నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో సాహితీ ప్రియులనే కాదు.. అద్భుతమైన స్క్రిప్టులతోనూ సినీ ప్రేమికులనూ అదే స్థాయిలో అలరించిన రైటర్ ఆయన.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన రచనలో క్లాసిక్స్, సూపర్ హిట్స్ వచ్చాయి. అభిలాష, ఛాలెంజ్, దొంగమొగుడు, రాక్షసుడు, పున్నమి నాగు.. ఇలా వీరి కలయికలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చాయి. చిరంజీవి సినిమా స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్‌తోనే యండమూరి మెగా ఫోన్ కూడా పట్టారు. కాకపోతే దర్శకుడిగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మళ్లీ ఆయన దర్శకత్వం జోలికి వెళ్లలేదు.
సినీ రచయితగా కూడా యండమూరి వైభవం 90వ దశకంలోనే ఆగిపోయింది. దశాబ్దం కిందట వచ్చిన శక్తి సినిమాకు ఆయన కథ అందించారు. అది పెద్ద డిజాస్టర్ కావడంతో సినిమాలకు దూరం అయిపోయారు. ఐతే ఇప్పుడు ఆయన మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండటం, అది కూడా దర్శకుడిగా కావడం విశేషం. తాను రచయితగా పని చేసిన దొంగమొగుడు సినిమాలో బాగా పాపులర్ అయిన నల్లంచు తెల్లచీర అనే పాట పల్లవినే టైటిల్‌గా పెట్టి సినిమా తీస్తున్నారు యండమూరి.
భూషణ్, దయా, జెన్ని, కిషోర్ దాస్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వయసు 70కి పైబడ్డప్పటికీ హుషారుగా కనిపించే యండమూరి.. యూత్ ఫుల్ సినిమా తీస్తున్నట్లు చెబుతున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవి కనగాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ వయసులో దర్శకుడిగా యండమూరి ఏమాత్రం సత్తా చాటుతారో చూడాలి.