ప్ర‌భాస్ డేరింగ్ స్టెప్


క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి గ‌త కొన్ని రోజుల్లో బాగానే త‌గ్గిన‌ప్ప‌టికీ.. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలాగే ఉంది. సినీ రంగానికి సంబంధించినంత వ‌ర‌కు ఇప్పుడిప్పుడే యాక్టివిటీ మొద‌వుతుంద‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. షూటింగ్స్ ఇంకో నెల రోజుల త‌ర్వాత కానీ మొద‌లుకావనే అంచ‌నాతో ఉన్నారు నిర్మాత‌లు. జులైలో షూటింగ్స్ కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జూన్‌లో అయితే షూటింగ్ గురించి టాలీవుడ్ హీరోలెవ‌రూ ఆలోచించే స్థితిలో లేర‌నే అనుకుంటున్నారు.

కానీ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మాత్రం సాహ‌సానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. అత‌ను ఈ నెల‌లోనే తిరిగి సెట్‌లోకి అడుగు పెడ‌తున్నాడ‌ట‌. మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోయిన ఆదిపురుష్ షూటింగ్‌ను ఈ నెల 20 త‌ర్వాత ప్ర‌భాస్ పునఃప్రారంభించ‌నున్నాడ‌ట‌. ఈ దిశ‌గా స‌న్నాహాలు కూడా మొద‌లైన‌ట్లు స‌మాచారం.

ముంబ‌యిలోని ఒక సెట్‌ను పున‌ర్నిర్మించే ప‌నులు ప్ర‌స్తుతం జ‌రుగ‌తున్నాయ‌ని.. అక్క‌డే ఆదిపురుష్ షూటింగ్ పునఃప్రారంభం కానుంద‌ని తాజా స‌మాచారం. అక్క‌డ ఓ షెడ్యూల్ ముగించుకుని, ఆ త‌ర్వాత చిత్ర బృందం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీకి వ‌స్తుంద‌ట‌. అక్క‌డ ఓ సుదీర్ఘ షెడ్యూల్ ఉంటుంద‌ని స‌మాచారం.

ఆదిపురుష్ షూటింగ్ మొద‌లు పెడుతున్న స‌మ‌యంలోనే ఈ సినిమా కోసం సిద్ధం చేసిన సెట్లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం తెలిసిందే. దాని వ‌ల్ల అంతరాయం క‌ల‌గ్గా.. త‌ర్వాత క‌రోనా వ‌ల్ల బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం జ‌రిగిన నేప‌థ్యంలో కొత్త షెడ్యూల్‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మొద‌లుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ముంబ‌యిలో క‌రోనా ప్ర‌భావం బాగా త‌గ్గ‌డంతో చిత్ర బృందం ధైర్యం చేస్తోంది. బ‌హుశా మొత్తం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత షూటింగ్ పునఃప్రారంభించుకోనున్న పేరున్న సినిమా ఆదిపురుష్‌యే అయ్యే ఛాన్సుంది.