‘పుష్ప-1’కు, ‘పుష్ప-2’కు మధ్యలో ఒక ట్విస్ట్

అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’ ఒక సినిమాగా మొదలైనప్పటికీ.. ఈ మధ్య దాన్ని రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దొరికిన ఖాళీలో కథను పొడిగించి.. రెండు భాగాలుగా విభజించే ప్రక్రియ నడుస్తోంది. బన్నీ వరుసగా ఈ రెండు భాగాల చిత్రీకరణలో పాల్గొంటాడన్న ఆలోచనతోనే అందరూ ఉన్నారు. కానీ బన్నీ మిత్రుడు, ‘గీతా ఆర్ట్స్’లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు ఇప్పుడో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాసు.. ‘పుష్ప-1’కు, ‘పుష్ప-2’కు మధ్య వేరే సినిమా చేస్తాడని వెల్లడించాడు. ఇది కూడా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు కానీ.. ఆ మధ్యలో అతను చేయబోయే సినిమా గురించి వాసు వెల్లడించిన సమాచారం మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరిచేదే.

‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ పూర్తి చేశాక, సెకండ్ పార్ట్‌కు ముందు బన్నీ ‘ఐకాన్’ మూవీని చేయబోతున్నాడని బన్నీ వాసు వెల్లడించాడు. ఈ లైనప్ ఫైనల్ అని, ఈ విషయంలో ఏ మార్పూ లేదని కూడా అతను స్పష్టం చేశాడు. ‘ఐకాన్’ గురించి చర్చ ఇప్పటిది కాదు. మూడేళ్ల ముందే ఈ సినిమాను ప్రకటించారు.

కానీ అది పట్టాలెక్కే సూచనలు ఎప్పుడూ కనిపించలేదు. ‘వకీల్ సాబ్’తో వేణు శ్రీరామ్ సత్తా చాటుకున్న నేపథ్యంలో ఈ సినిమా మొదలైపోతుందని అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. కానీ బన్నీ వైపు నుంచి మాత్రం ఏ అప్‌డేట్ లేదు. అతను వేరే దర్శకులతో సంప్రదింపులు జరపడం చూస్తే ‘ఐకాన్’ చేసే ఉద్దేశంలో లేడనిపించింది.

ఆ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బన్నీని ‘ఐకాన్’గా చూసే అవకాశాలు లేవనుకున్నారంతా. కానీ ఇప్పుడేమో బన్నీ వాసు.. ‘పుష్ప-1’ అవ్వగానే బన్నీ ‘ఐకాన్’ చేస్తాడంటున్నాడు. ఇదిలా ఉండగా.. మురుగదాస్, బోయపాటి శ్రీనులతో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉందని.. ఐతే ఏ సినిమా ఎఫ్పుడు ఉంటుందో చెప్పలేనని బన్నీ వాసు చెప్పాడు.