సినిమా న‌టి ట్ర‌క్ డ్రైవ‌ర్‌గా మారి..


కరోనా-లాక్ డౌన్ పుణ్య‌మా అని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు కూడా రోడ్డున ప‌డిపోయారు. చిన్నా చిత‌కా ప‌నులు చేసుకుని క‌డుపు నింపుకోవాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఎంతోమంది ప్రైవేటు టీచ‌ర్లు ఉపాధి కోల్పోయి కూలి ప‌నుల‌కు వెళ్లిన ప‌రిస్థితులు చూశాం. ఐతే సినిమాల్లో కాస్త పేరున్న పాత్ర‌లు చేసిన వాళ్లు కూడా ఉపాధి లేక ప‌నులు చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం. అందులోనూ ఒక న‌టి క‌రోనా వ‌ల్ల సంపాద‌న కోల్పోయి ట్ర‌క్ డ్రైవ‌ర్‌గా మారిందంటే చిత్రంగానే ఉంటుంది. కేరళ‌లో ఇదే జ‌రిగింది. షూటింగ్‌లు లేక ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ట్రక్ డ్రైవ‌ర్‌గా మారిన ఆ న‌టి పేరు.. కార్తీక. ఆమె కొన్ని మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించింది.

ఐతే లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లు లేక ఖాళీ అయిపోవ‌డంతో కార్తీక త‌న డ్రైవింగ్ నైపుణ్యాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చుకోవాల‌నుకుంది. ఒక ట్ర‌క్ కొనుక్కుంది. కేర‌ళ‌లో ఫైనాపిల్, కొబ్బ‌రిబొండాలు వంటి వాటిని తక్కువ ధరకు దొరికే చోటు నుంచి మంచి రేటు పలికే చోటుకు త‌ర‌లించ‌డం ద్వారా ఆమె మంచి ఆదాయం అందుకుంటోంది. త‌నే ట్ర‌క్ న‌డుపుకుంటూ డ‌బ్బులు సంపాదిస్తోంది.

ఇటీవ‌ల కేర‌ళ‌లోని మలక్‌పురం చెక్ పోస్టు ద‌గ్గ‌ర వెళ్తున్న ట్ర‌క్కును పోలీసులు ఆపారు. ఆ ట్ర‌క్కును జీన్స్ ప్యాంటు, టీ ష‌ర్ట్ వేసుకున్న‌ ఓ అమ్మాయి న‌డుపుతుండ‌గా.. బండిలో ఏముందని ప్రశ్నించగా ఫైనాపిల్స్ అని చెప్పింది. ట్రక్కులో చూస్తే పైనాపిల్సే ఉన్నాయి. కాస్త ప‌రిశీల‌న‌గా చూసిన పోలీసుల‌కు ట్ర‌క్కు న‌డుపుతున్న‌టి న‌టి కార్తీక అని అర్థ‌మైంది. ఆమె ట్ర‌క్కు న‌డుపుతున్న దృశ్యాన్ని ఫొటో తీసి ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా.. త‌న స్ఫూర్తిదాయ‌క క‌థ అంద‌రికీ తెలిసింది. కార్తీక‌ భర్త గల్ఫ్‌లో పని చేస్తుండగా.. ఆమెకు 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ఆదాయం కోసం ఏదో ఒక‌టి చేయాల‌ని ఇలా డ్రైవ‌ర్‌గా మారినట్లు కార్తీక వెల్ల‌డించింది.