ఉదయ్ కిరణ్ సినిమా వచ్చేస్తోంది


ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. రెండు దశాబ్దాల కిందట ‘చిత్రం’ లాంటి సెన్సేషనల్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశాడు ఈ యంగ్ హీరో. ఐతే సరైన సినిమాలు ఎంచుకోక, కాలం కలిసి రాక వరుస పరాజయాలు ఎదుర్కొని ఫేడవుట్ అయిపోయిన ఉదయ్.. ఏడేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడి కోట్లాది మందికి వేదన కలిగించాడు.

ఎంతో భవిష్యత్ ఉందనుకున్న హీరో కెరీర్ అలా అయిపోవడం, చివరికి అతను ప్రాణాలే కోల్పోవడం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద విషాదంగా మారింది. ఉదయ్ చివరగా ‘జై శ్రీరామ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. దాని తర్వాత అతను నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ అనే చిత్రం విడుదలకు నోచుకోలేదు.

ఉదయ్ మరణానంతరం అతడికి నివాళిగా ‘చిత్రం చెప్పిన కథ’ను రిలీజ్ చేయడానికి దాని మేకర్స్ గట్టిగానే ప్రయత్నించారు. సినిమా విడుదల గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. చిన్న టీజర్ కూడా వదిలారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా బయటికైతే రాలేదు. చూస్తుండగానే ఏడేళ్లు గడిచిపోయాయి. ‘చిత్రం చెప్పిన కథ’ ఏమైందో తెలియదు. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. చిన్న సినిమాలకు థియేటర్లలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ‘చిత్రం చెప్పిన కథ’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమా మీద పెట్టిన ఖర్చంతా వృథాగా మారకుండా ఎంతో కొంత మొత్తానికి ఓటీటీకి అమ్మేయడానికి సంప్రదింపులు జరుగుతన్నాయట. ఉదయ్ చివరి సినిమాను ఓటీటీలో చూడ్డానికి జనాలు ఎంతో కొంత ఆసక్తి ప్రదర్శిస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి త్వరలోనే ‘చిత్రం చెప్పే కథ’ ప్రేక్షకులను పకలరిస్తుందని ఆశిద్దాం. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మున్నా నిర్మించాడు. మదాలస శర్మ కథానాయికగా నటించింది.