ఈ చిన్న తెలుగు సిరీస్ బ్లాక్‌బస్టరబ్బా

30 వెడ్స్ 21.. ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్. ఛాయ్ బిస్కెట్ వాళ్లు అందించిన ఈ షో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. చైతన్య, అనన్య అనే కొత్త హీరో హీరోయిన్లు జంటగా పృథ్వీ వనం అనే ఫిలిం మేకర్ ఈ సిరీస్‌ను రూపొందించాడు. కొన్నేళ్ల నుంచి ప్రతిభావంతులైన కొత్త నటీనటులు, టెక్నీషియన్లను గుర్తించి వినూత్నమైన షార్ట్ ఫిలిమ్స్‌తో ఆదరణ పెంచుకున్న ఛాయ్ బిస్కెట్.. కొన్ని నెలల కిందటే ‘30 వెడ్స్ 21’ పేరుతో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది.

ఐతే రిలీజ్ ముందు వరకు ఈ సిరీస్‌కు అంత హైప్ ఏమీ లేదు. ఛాయ్ బిస్కెట్ ఫాలోవర్లు కాకుండా మిగతా వాళ్ల దృష్టిని ఇదేమంత ఆకర్షించలేదు. కానీ వారానికి ఒకటి చొప్పున రెండు ఎపిసోడ్లు బయటికి రాగానే దీనికి అపూర్వమైన ఆదరణ దక్కింది. ఒక్కో ఎపిసోడ్ చొప్పున లెక్కగడితే.. మొత్తం ఆరు ఎపిసోడ్లకు 4 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే దీనికి ఎలాంటి ఆదరణ వస్తోందో అర్థం చేసుకోవచ్చు.

30 ఏళ్ల వయసున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన అభీష్టానికి వ్యతిరేకంగా 21 ఏళ్ల వయసున్న చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల తలెత్తే సమస్యలు.. చిన్న చిన్న గొడవలు.. అలకలు.. గిల్లికజ్జాల నేపథ్యంలో చాలా సరదాగా, ఆహ్లాదంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. చాలా సహజంగా మనకు తెలిసిన వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా, మనం బాగా రిలేట్ చేసుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చక్కటి విజువల్స్, వీనుల విందైన సంగీతం కూడా దీనికి ప్లస్ అయ్యాయి.

లీడ్ రోల్స్ చేసిన చైతన్య, అనన్య ఇద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. ఈ సిరీస్‌కు రైటింగ్ పెద్ద ప్లస్. ప్రతి ఎపిసోడ్ చిరునవ్వులు చిందిస్తూ.. హృదయాలను తాకుతూ రోజు రోజుకూ వ్యూస్ పెంచుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ సిరీస్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిన్న సిరీస్‌కు ఇంత ఆదరణ దక్కడం మేకర్స్ సహా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఊపులో ‘30 వెడ్స్ 21’ సెకండ్ సీజన్‌ను కూడా రెడీ చేస్తుండటం విశేషం.