కీర్తి సురేష్ సినిమా.. పత్తా లేకుండా పోయిందే!

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి అంగీకరించింది కీర్తి సురేష్. లాక్ డౌన్ సమయంలో ఆమె నటించిన ‘పెంగ్విన్’,’మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. రెండూ డిజాస్టర్లుగా తేలిపోయాయి.

ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలం అవుతోంది. గతేడాది లాక్ డౌన్ లోనే రిలీజ్ ఉంటుందని హడావిడి చేశారు. కానీ ఏడాది గడిచిపోయింది. రెండు నెలల క్రితం సినిమాను జూన్ 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. లాక్ డౌన్ కారణంగా మళ్లీ సినిమాను వాయిదా వేసినట్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై మరో అప్డేట్ రాలేదు.

ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. గతంలో కీర్తి నటించిన సినిమాలు ఓటీటీలో వర్కవుట్ అవ్వకపోవడంతో.. ఈసారి నిర్మాతలు జంకుతున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో ‘హైదరాబాద్ బ్లూస్’, ‘తీన్ దీవారే’, ‘ఇక్బల్’ వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన నగేష్ కుకునూర్ తీసిన సినిమా కావడంతో దీనిపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఒక పల్లెటూరి అల్లరి పిల్ల రైఫిల్ షూటర్ గా ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి నటులు ముఖ్యపాత్రలు పోషించారు.